Bahar Biryani Cafe: దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రముఖ ‘బహార్ బిర్యానీ కేఫ్’పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్ రైడ్స్ నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ వెనుక ఎంతటి నిర్లక్ష్యం ఉందో ఈ తనిఖీల్లో తేలింది. హోటల్ కిచెన్‌లో నిల్వ ఉంచిన పదార్థాలను చూసి అధికారులే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ సోదాల్లో సుమారు 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన పలు ఆహార నిల్వలను ఫుడ్ సేఫ్టీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ పాడైపోయిన మాంసాన్ని అధికారులు వెంటనే అక్కడికక్కడే పారవేయించారు. అనంతరం హోటల్లోని పలు ఆహార పదార్థాల నమూనాలను (శామిల్స్) సేకరించి, సమగ్ర విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు.
వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. కనీస పరిశుభ్రత పాటించని ఈ కేఫ్‌పై కఠిన చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. బహార్ బిర్యానీ కేఫ్ ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు రిపోర్ట్ పంపారు. బయట తిండిపై ఆధారపడే సామాన్యుల భద్రతను పక్కనబెట్టిన యాజమాన్యం తీరుపై ప్రజలు మండిపడుతుండగా, ఈ హఠాత్ తనిఖీలతో స్థానిక రెస్టారెంట్ నిర్వాహకుల్లో తీవ్ర కలకలం రేగింది.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?