EPFO WhatsApp: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు వేగంగా, పారదర్శకంగా సమాచారాన్ని అందించడానికి డిజిటల్ దిశగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లను అందించేందుకు అధికారిక ‘వాట్సాప్ ఛానెల్’ను అందుబాటులోకి తెచ్చింది. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సభ్యులందరూ ఈ ఛానెల్‌లో చేరాలని ఈపీఎఫ్ఓ పిలుపునిచ్చింది.
ఈపీఎఫ్ఓ అందించే అధికారిక సేవలు, సమాచారాన్ని పొందేందుకు సభ్యులు నేరుగా వారి వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు. అందుకోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఛానెల్ ద్వారా తాజా సమాచారమే కాకుండా పీఎఫ్ అడ్వాన్స్ విత్ డ్రా, ఉద్యోగంలో తిరిగి చేరినప్పుడు విరాళాల ప్రక్రియ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన చెల్లింపులు వంటి పలు అంశాలపై అవగాహన కల్పించే యూట్యూబ్ వీడియోల లింక్‌లను కూడా షేర్ చేస్తున్నారు.
EPFO now on WhatsApp too!
📢Join EPFO's official WhatsApp Channel to get important updates and useful information. Click on the link to join. https://t.co/k2KmISipxw #EPFO #EPFOWithYou #HumHainNa #EPFOWhatsAppChannel pic.twitter.com/mgLueBG1GD
— EPFO (@officialepfo) September 13, 2026
బ్యాంకులు అందిస్తున్న వాట్సాప్ సేవల తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా త్వరలో వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం.. దేశంలో వాట్సాప్ వాడకం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ‘హలో’ (Hello) అని మెసేజ్ చేయడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా వాట్సప్ సేవలను పొందే వెసులుబాటును భవిష్యత్తులో కల్పించనున్నారు.
ఖాతాదారుల సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ ఇటీవల విత్ డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది. గతంలో ఉన్న 13 రకాల నిబంధనలను కుదించి.. అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు ముఖ్య కేటగిరీలుగా విభజించారు. కొత్త నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ నుండి 100% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also Read: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!
గతంలో పీఎఫ్ విత్‌డ్రా అప్లికేషన్ పెట్టిన తర్వాత డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఆటో-సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. తాజాగా ఈ ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు ఈపీఎఫ్ఓ పెంచింది. వివాహం, విద్య, వైద్యం, గృహ అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే సభ్యులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తోంది.
Also Read: ఈ రైలు ఎక్కితే ఆహారం ఉచితం.. జనరల్ నుండి AC వరకు.. వేడివేడి భోజనం!