RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ సేవలను మరింత మెరుగుపరిచే విషయంలో కీలక ప్రకటన చేసింది. KYC (Know Your Customer) ప్రక్రియను క్రమబద్ధం చేయడం, కస్టమర్లకు అసౌకర్యాన్ని తొలగించడం లక్ష్యంగా RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చారు. ముఖ్యంగా, బ్యాంకులు కస్టమర్లను పదే పదే కాల్ చేసి, ఇప్పటికే సమర్పించిన KYC పత్రాలను మళ్లీ అడగడం మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
బ్యాంకింగ్ రంగంలో తీవ్ర పోటీ
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల బ్యాంకులకు కొన్ని కీలక సూచనలు చేశారు. కస్టమర్లు ఇప్పటికే బ్యాంకుకు KYC పత్రాలను సమర్పించిన తర్వాత, అదే పత్రాలను మళ్లీ మళ్లీ అడగడం తగదని ఆయన స్పష్టంగా చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచుకోవడం అత్యంత అవసరమని ఆయన ప్రస్తావించారు. కస్టమర్లతో పదే పదే సంప్రదించడం వల్ల కేవలం అసౌకర్యమే కాకుండా, కస్టమర్ విశ్వాసం కూడా దెబ్బతింటుందని మల్హోత్రా పేర్కొన్నారు.
కస్టమర్ సేవలను మెరుగుపరచడం అత్యవసరం
బ్యాంకులు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం కేవలం కర్తవ్యమే కాదు, అది బ్యాంకుల ప్రయోజనాలకు కూడా అనుకూలంగా ఉంటుందని మల్హోత్రా అన్నారు. కస్టమర్లకు అనవసరంగా కాల్ చేయడం వల్ల బ్యాంకులపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారం కస్టమర్ ఫిర్యాదుల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని గవర్నర్ వివరించారు.
డేటా బ్యాంకులు కేంద్రీకరించాలి
మల్హోత్రా ప్రకటన ప్రకారం ఒకసారి కస్టమర్ సమర్పించిన KYC పత్రాలను బ్యాంకుల కేంద్ర డేటాబేస్‌లో భద్రపరచాలి. తద్వారా, అదే కస్టమర్ నుంచి మళ్లీ మళ్లీ పత్రాలను అడగాల్సిన అవసరం ఉండదని RBI సూచించింది. బ్యాంకింగ్ రంగంలో అనేక బ్యాంకులు, NBFCలు తమ శాఖలు లేదా కార్యాలయాలకు కేంద్ర డేటాబేస్ నుంచి సమాచారం పొందేందుకు అనుమతించకపోవడం వల్లే వినియోగదారులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
Read Also: Business Idea: తక్కువ పనితో నెలకు రూ. 2 లక్షలకుపైగా …
సెంట్రలైజ్డ్ డేటాబేస్ ప్రయోజనాలు
-బ్యాంకులు ఒక్కసారి KYC డాక్యుమెంట్లను తీసుకున్న తర్వాత వాటిని సురక్షితంగా భద్రపరిచే విధానం ఏర్పాటు చేయాలి.
-అన్ని శాఖలు, కార్యాలయాలు, కస్టమర్ సేవా కేంద్రాలు ఒకే డేటాబేస్‌ను యాక్సెస్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
-తద్వారా, వినియోగదారులకు పదే పదే కాల్‌లు రావడం, అసౌకర్యం కలగడం నివారించవచ్చు.
కస్టమర్ ఫిర్యాదులు భారీగా పెరుగుతున్నాయి
KYC సంబంధిత సమస్యలు పెరుగుతుండటంతో RBIకి వచ్చే వినియోగదారుల ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు కోటి (1 crore) కస్టమర్ ఫిర్యాదులు వచ్చాయని మల్హోత్రా పేర్కొన్నారు. ఇందులో 57% ఫిర్యాదులను RBI అంబుడ్స్‌మన్ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియాలో అసంతృప్తి
కస్టమర్ సేవలపై గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువడుతున్నాయి. KYC పత్రాలను మళ్లీ సమర్పించమని బ్యాంకుల నుంచి నిరంతరం వచ్చే కాల్స్ వినియోగదారులను విసిగిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. బ్యాంకులు వినియోగదారుల ఫిర్యాదులను తగినంత ప్రాముఖ్యతతో పరిష్కరించాలని, కస్టమర్లతో సున్నితంగా వ్యవహరించాలని RBI గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గౌరవంగా స్వీకరించడం
కస్టమర్ ఫిర్యాదులను నిర్లక్ష్యంగా తీసుకోవద్దన్నారు. ఇది మీ సంస్థలోని లోపాలను ఎత్తి చూపించే సూచికగా భావించాలని, సమస్యలను పరిష్కరించడంలో మీకు అవకాశం లభించినట్లు భావించాలని మల్హోత్రా స్పష్టం చేశారు. ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించడం ద్వారా మాత్రమే కస్టమర్ విశ్వాసాన్ని నిలుపుకోవచ్చని ఆయన హితవు పలికారు.