హోమ్ లోన్ తీసుకున్న వారు EMI కట్టలేకపోతే బ్యాంకులు ఆ ఇంటిని జప్తు చేస్తాయి. తామిచ్చిన అప్పుని ఎలాగోలా రికవరీ చేసుకుంటాయి. వెహికల్ లోన్ లో కూడా ఆ ఆప్షన్ ఉంది. కిస్తీలు కట్టలేకపోతే వాహనాన్ని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోతారు. మరి సెల్ ఫోన్ సంగతేంటి? సెల్ ఫోన్ కి ఈఎంఐకి లింకేంటని అనుకుంటున్నారా? ఆర్బీఐ ఆలోచనలతో ఇప్పుడిది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ కోసం లోన్ తీసుకుని ఈఎంఐ కట్టలేకపోతే దాన్ని ఆటోమేటిక్ గా లాక్ చేసే అధికారం లోన్ ఇచ్చిన సంస్థకు దఖలు పరచడమే ఈ కొత్త నిర్ణయం. త్వరలో ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని అంటున్నారు. అయితే దీనికోసం ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది.
ఒక్కొకరికి రెండేసి ఫోన్లు..
భారత దేశ జనాభా 140 కోట్లు. కానీ భారత్ లో ఉన్న ఫోన్ల సంఖ్య 116 కోట్లు. అంటే ముసలీ ముతకా, పిల్లలు.. వీరందర్నీ తిసేసినా ఒక్కొకరి దగ్గర కనీసం రెండు మూడు ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ రేటు లక్షల్లో ఉంటున్నా సరే ఈఎంఐ వేలల్లోనే ఉంటుంది కాబట్టి చాలామంది మధ్యతరగతి వారు కూడా కాస్ట్ లీ ఫోన్లు కొంటున్నారు. కానీ కొన్నిసార్లు ఈఎంఐలు కట్టేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి ఆయా సంస్థలు కూడా అవస్థలు పడుతున్నాయి. అక్కడ్నుంచే ఈ కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. ఈఎంఐ కట్టకపోతే మనకు లోన్ ఇచ్చిన సంస్థ మన ఫోన్ ని లాక్ చేస్తుంది. ఆ ఫోన్ తిరిగి అన్ లాక్ కావాలంటే ఈఎంఐ కట్టాల్సిందే. ఇలాంటి నిబంధన ఉంటే ఎవరైనా ఈఎంఐని స్కిప్ చేస్తారా? అందుకే దీన్ని తెరపైకి తెచ్చింది ఆర్బీఐ. దీనివల్ల రుణదాతలకు కాస్త వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఈ నిబంధన వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లకు లాభం కలుగుతుంది. అదే సమయంలో లోన్ తీసుకున్నవారు కూడా తిరిగి చెల్లించే విషయంలో కాస్త కచ్చితంగా ఉంటారు.
ఈఎంఐ లేట్ అయితే ఫోన్ లాక్..
అయితే ఇదేమీ కొత్త రూల్ కాదని, గతేడాది యాప్ ల ద్వారా రుణాలు ఇచ్చే కొన్ని సంస్థలు ఈ పద్ధతిని మొదలు పెడితే, ఆర్బీఐ దాన్ని ఆపాలని సూచించిందట. అయితే ఇప్పుడు ఆర్బీఐనే ఈ పద్ధతిని అందరికీ వర్తించేలా కొత్త నిబంధనలు తయారు చేస్తోంది. ఈఎంఐ ద్వారా ఫోన్ కొన్నప్పుడు దానిలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తారు. ఈఎంఐ పేమెంట్స్ కి ఆ సాఫ్ట్ వేర్ కి లింక్ ఉంటుంది. ఈఎంఐ లేట్ అయితే ఆటోమేటిక్ గా ఆ సాఫ్ట్ వేర్ మన ఫోన్ ని లాక్ చేస్తుంది.
పర్సనల్ డేటా సంగతేంటి?
అయితే ఇక్కడ చిన్న సమస్య ఉంది. మన ఫోన్ ని మనకు లోన్ ఇచ్చిన సంస్థ లాక్ చేస్తే, అందులో డేటా సంగతేంటి? ఆ డేటాకు మాత్రం ప్రైవసీ ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకోబోతోంది. మన ఫోన్ లాక్ అయినా, మన డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండదు. అయితే ఆ డేటాను భద్రంగా తిరిగి తీసుకోవాలంటే మాత్రం ఈఎంఐలు అన్నీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నియమాల వల్ల డిఫాల్టర్లు తగ్గుతారని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇటీవల కాలంలో ఫోన్ల ద్వారా, వివిధ యాప్ ల ద్వారా తీసుకునే పర్సనల్ లోన్స్ తో ఎక్కువమంది సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకీ ఇలాంటి లోన్ల సంఖ్య పెరగడంతో ఆర్బీఐ రుణ ఎగవేతదారులను కట్టడి చేసేందుకు, రుణదాతలకు కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఈ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తోంది.