 
					NDA Manifesto: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, సీఎం నితీశ్ కుమార్, హెచ్‌ఎఎం అధినేత జితన్ రామ్ మాంఝీ, ఎల్‌జెపి(ఆర్‌వి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, ఆర్‌ఎల్‌ఎం నాయకుడు ఉపేంద్ర కుష్వాహ పాల్గొన్నారు.
యువతకు కోటి ఉద్యోగాల హామీ
ఎన్డీఏ మేనిఫెస్టోలో యువతకు కోటి ఉద్యోగాల కల్పిస్తామని హామీ ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వం. ఇందుకోసం ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆధునిక సాంకేతిక పరికరాలతో వీటిని నిర్మించనున్నారు. అలాగే, బీహార్ స్పోర్ట్స్ సిటీలో ప్రతి విభాగానికి ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు.
పరిశ్రమల విస్తరణ
బీహార్‌లో 10 కొత్త పారిశ్రామిక పార్కులు, 100 MSME పార్కులు, అలాగే 50,000కు పైగా కుటీర సంస్థల స్థాపనకు ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చడమే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. అదనంగా, డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్ ఏర్పాటు చేసి ఆధునిక పరిశ్రమలకు దారితీయనున్నట్లు ప్రకటించారు.
మహిళా సాధికారత
ఎన్డీఏ మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేక హామీలు ఇచ్చారు. మహిళా ఉపాధి పథకం కింద మహిళలకు గరిష్టంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. లఖ్పతి దీదీ యోజన కింద 1 కోటి మంది మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రైతులకు మద్దతు
వ్యవసాయం బీహార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొంటూ రైతులకు పలు హామీలు ఇచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి సహాయం ₹6,000 నుండి ₹9,000కు పెంచాలని, అలాగే మత్స్యకారుల సబ్సిడీ ₹4,500 నుండి ₹9,000కు పెంచాలని నిర్ణయించారు. అన్ని పంటలకు MSP హామీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ప్రతి సబ్ డివిజన్‌లో ఎస్సీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్నారు. ఉన్నత విద్యలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. పేద కుటుంబాల పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య అందించనున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించడానికి ప్రణాళిక రూపొందించారు.
ఇళ్ల నిర్మాణం, రేషన్, ఉచిత విద్యుత్
50 లక్షల కొత్త పక్కా ఇళ్ల నిర్మాణం, పేదలకు ఉచిత రేషన్, ప్రతి కుటుంబానికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే సామాజిక భద్రతా పెన్షన్ అందించనుంది ఎన్డీయే ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రధాన పాఠశాలల పునరుద్ధరణకు రూ.5,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
మౌలిక వసతుల విస్తరణ
బీహార్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఎన్డీఏ 7 ఎక్స్‌ప్రెస్‌వేలు, 3,600 కి.మీ రైల్వే ట్రాక్ ఆధునీకరణ ప్రణాళికలు రూపొందించింది. ప్రతి జిల్లాలో ప్రపంచ స్థాయి మెడిసిటీలు, వైద్య కళాశాలలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆధ్యాత్మిక నగరం – సీతాపురం
మతపరమైన పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. జానకి జన్మస్థలంను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసి సీతాపురంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
Also Read: ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించిన ప్రధానీ మోదీ
అంతర్జాతీయ కనెక్టివిటీ
బీహార్‌ను గ్లోబల్ కనెక్టివిటీకి అనుసంధానించడానికి పాట్నా, దర్భంగా, పూర్నియా, భాగల్పూర్‌లలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించనున్నారు. అదనంగా, 4 కొత్త నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది.