 
					Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అమాంతంగా వేడి పెంచేసింది. ఈ ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతలే కాదు.. సామాన్యుల దృష్టి దీనిపై పడింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమతమ ప్రచార వేగాన్ని పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల తరపున 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయిన్లను ప్రచారంలో నిమగ్నమయ్యారు.
చంద్రబాబు-పవన్ ప్రచారం మాటేంటి?
ఇక బీజేపీ జాబితాలో రాష్ట్ర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ నేతలు, పలువురు కేంద్రమంత్రులు ఉన్నారు. ఈ ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రచారానికి దిగుతారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్‌లు దూసుకు పోతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కాస్త వీక్‌గా కనిపిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట.
హైకమాండ్ దృష్టికి తెలంగాణ బీజేపీ నేతలు?
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని ప్రస్తావించారట. నేతలు చెప్పినదంతా విని సైలెంట్‌గా ఉన్నారని సమాచారం. ఒకవేళ ఇద్దరు నేతలు ప్రచారానికి వస్తే రాజకీయం మరింత రంజుగా సాగడం ఖాయమనే చర్చ లేకపోలేదు.
2023 ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను బీజేపీ గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో గోషామహల్ మినహా ఎక్కడా ఆ పార్టీ గెలవలేదు. హైదరాబాద్‌పై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఎన్నిక ఫలితం వచ్చే ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే బైపోల్‌లో కచ్చితంగా గెలిచి తాము బలంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
ALSO READ: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఎకరాకు పదివేలు సాయం
బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో కేంద్రమంత్రులు నిర్మల, మేఘావాల్, సీఎం భజన్ లాల్ శర్మ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లను రప్పించాలని భావిస్తున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు.
సిటీ కార్మికులు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సినీ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఇలాంటి సమయంలో ప్రచారానికి వస్తే బాగుంటుందని అంటున్నారు నేతలు. రోడ్ షో.. బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
అన్నట్లు నవంబర్ ఒకటి(శనివారం) నుంచి ఐదు రోజులు లండన్ పర్యటనకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. నవంబర్ ఆరున తిరిగి అమరావతికి రానున్నారు. అప్పటికి ప్రచారానికి కేవలం మూడు రోజులు ఉంటుంది. నవంబర్ తొమ్మిదితో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలు ప్రచారానికి రావడం కష్టమేనన్నది టీడీపీ, జనసేన పార్టీ వర్గాల మాట. ఆ మూడు రోజులు ఏమైనా జరగవచ్చని అంటున్నారు.