How to get Mortgage Loan: అత్యవసర సమయాల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఏమి చేయాలో తెలియక చాలామంది తికమక పడుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఆందోళన చెందకుండా మీ సమస్యలను గట్టెక్కడానికి ఉన్న మార్గమే మార్ట్‌గేజ్ లోన్. నిజానికి ఇది ఒక రిస్క్ తో కూడినటువంటి ఒప్పందమే, కానీ మీరు సమస్య నుంచి బయటపడటానికి ఇది ఒక సులభమైన మార్గం అని చెప్పవచ్చు. సాధారణంగా బ్యాంకులు మీ ఆస్తిని తాకట్టు పెట్టడం ద్వారా దాని విలువ ఆధారంగా రుణాన్ని అందిస్తాయి. ఆ రుణాన్ని ఉపయోగించుకొని మీరు మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. మార్ట్‌గేజ్ లోన్ అంటే ఒక సురక్షితమైన సెక్యూరిటీ లోన్ అని అర్థం. దీని కింద ఇల్లు, భూమి, కమర్షియల్ ప్రాపర్టీ వంటివి తాకట్టుగా పెట్టవచ్చు. ఆ తర్వాత ప్రతి నెల వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించడం ద్వారా మార్ట్‌గేజ్ లోన్ తిరిగి చెల్లింపు చేసుకోవచ్చు.
మార్ట్‌గేజ్ లోన్ ఎలా పొందాలి..
ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు మార్ట్‌గేజ్ లోన్ అందిస్తున్నాయి. కనుక సులభంగా ఈ తరహా రుణం పొందవచ్చు. అయితే ఈ రుణం గురించి తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు తిరిగి రుణం చెల్లించడంలో విఫలమైతే మాత్రం మీ ఆస్తిని బ్యాంకు వారు జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జప్తు చేసుకున్న ఆస్తిని వారు వేలంపాటలో విక్రయించి, తమ రుణాన్ని రికవరీ చేసుకుంటారు. కనుక మార్ట్‌గేజ్ లోన్ రుణం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మార్ట్‌గేజ్ లోన్ తీసుకునేందుకు కావాల్సిన అర్హతల గురించి తెలుసుకుందాం
>> 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వ్యక్తులు ఈ మార్ట్‌గేజ్ లోన్ తీసుకోవచ్చు,
>> క్రెడిట్ స్కోర్ 700 పైన ఉన్నవారికిి మార్ట్‌గేజ్ లోన్ సులభంగా లభిస్తుంది. అయితే ఇది సెక్యూరిటీ లోన్ అయిన నేపథ్యంలో సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ లోన్ లభించే అవకాశం ఉంది.
>> మీరు తాకట్టు పెట్టిన ఆస్తి విలువలో 60 నుంచి 70 శాతం మాత్రమే మార్ట్‌గేజ్ లోన్ కింద రుణం పొందవచ్చు.
ఆస్తి తాకట్టు పెట్టడానికి కావలసిన పత్రాలు ఇవే..
సేల్ డీడ్, టైటిల్ డీడ్, ఆస్తి పన్ను చెల్లించిన రసీదు, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ కాపీ, ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్) అవసరం అవుతాయి. వీటితోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫారం 16, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్, మీరు ఉద్యోగి అయితే ఆరు నెలల శాలరీ స్లిప్స్ అవసరం అవుతాయి. ఒకవేళ మీరు వ్యాపారి అయినట్లయితే మూడు సంవత్సరాల ఐటిఆర్, ఒక సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్, మీ బిజినెస్ లైసెన్స్, మీ కరెంట్ ఖాతా లావాదేవీలు అవసరం అవుతాయి.
మార్ట్‌గేజ్ లోన్ వల్ల కలిగే లాభాలు ఇవే
>> మీరు అధిక వడ్డీ ధరలకు ఎక్కడి నుంచి అయినా రుణాలను పొందినట్లయితే వాటిని తీర్చుకునేందుకు ఈ రుణాలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
>> ఒకవేళ మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నట్లయితే, బయట ఎక్కడ రుణాలు లభించకపోతే ఈ తరహా రుణం పొందవచ్చు.
>> అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఇబ్బందుల బారిన పడకుండా ఉండేందుకు మార్ట్‌గేజ్ లోన్ చాలా ఉపయోగపడుతుంది.
మార్ట్‌గేజ్ లోన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
>> మీకు ఎంత రుణం అవసరం అవుతుందో అంత లోన్ మాత్రమే తీసుకోవాలి.
>> క్రమం తప్పకుండా ప్రతి నెల వాయిదాలను చెల్లించాలి.
>> మీరు రుణానికి అప్లై చేసుకునే ముందు వివిధ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందో గమనించి తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుని ఎంపిక చేసుకుంటే మంచిది.
>> . రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత ఎన్వోసీ తీసుకొని ఆస్తి పత్రాలు వెనక్కి తీసుకోవడం మర్చిపోవద్దు.