Rolls-Royce Focus In AP: దేశంలోకి భారీ పెట్టుబడి రానుందా? బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ అడుగుపెట్టేందుకు సిద్ధమైందా? వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను ఆ కంపెనీ పరిశీలన చేస్తున్నారా? ఏపీ ప్రభుత్వం పెద్దలు ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులతో మంతనాలు మొదలుపెట్టారా? అవునే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.
భారత్‌లో పెట్టుబడులపై రోల్స్ రాయిల్
దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో తయారీ కంపెనీల చూపు భారత్‌పై పడింది. దేశీయ విమాన కంపెనీలు ఇప్పటికే పలు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో విమానాల తయారీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులపై ఫోకస్ చేశాయి.
బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిల్ సంస్థ ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధులు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విమాన ఇంజిన్ల తయారీ అగ్రగామి సంస్థ అయిన రోల్స్ రాయిల్, భారత్‌ను మూడో అతి పెద్ద మార్కెట్‌గా చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీలను తన స్వదేశ మార్కెట్లుగా పరిగణించింది.
ఆ కంపెనీ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు?
బ్రిటిష్ ఏరో-ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. జెట్ ఇంజిన్లు, నేవల్ ప్రొపల్షన్, ల్యాండ్ సిస్టమ్స్, అడ్వాన్స్ ఇంజినీరింగ్ సహా పలు విభాగాల్లో భారత్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు ఆ కంపెనీ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ తెలిపారు.
అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ఏఎంసీఏ కార్యక్రమం కింద తయారు చేయబోయే కాంబాట్ జెట్‌ల కోసం తదుపరి తరం ఏరో ఇంజిన్‌లను అభివృద్ధి చేయడం తమ ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. భారత వైమానిక రంగం భవిష్యత్ యుద్ధ విమానాల కోసం ఇంజిన్‌లను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ALSO READ: ప్రపంచ గనుల రంగంలో అక్కడ లక్షల టన్నుల గోల్డ్ మైన్స్
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. అర్జున్ ట్యాంక్‌ల ఇంజిన్, భవిష్యత్‌లో కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ కోసమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మా కంపెనీకి ఆ తరహా సామర్థ్యం, అనుభవం ఉందని, ఈ విషయంలో నిరూపించామని తెలిపారు. ఏరో ఇంజిన్‌ను మెరైన్ ఇంజిన్‌గా చేయగల సామర్థ్యం కలిగిన కంపెనీల్లో రోల్స్ రాయిస్ కూడా ఉందని వివరించారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే, అది పెద్ద పెట్టుబడి అవుతుందన్నారు.
ఈ విషయం తెలియగానే హర్యానా, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ విషయానికి వద్దాం. నవంబర్‌లో సీఎం చంద్రబాబు లండన్ వెళ్లారని ఆ సమయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్టు ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలావుండగా మంత్రి లోకేష్ ఇప్పటికే లండన్‌కి వెళ్లారని, ఆ కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి రోల్స్ రాయిస్ కంపెనీ ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందో చూడాలి.