ప్రావిడెంట్ ఫండ్.. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి జీవనం సాఫీగా సాగేందుకు ఉపయోగపడే భవిష్య నిధి. ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరే కానీ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇదో అర్థం కాని బ్రహ్మపదార్థం. పీఎఫ్ అనేది ఉద్యోగికి సంబంధించిన ఆస్తి. దానిపై పూర్తి హక్కులు అతడికే ఉంటాయి. కానీ అది ఉందన్న భరోసా ప్రైవేట్ ఉద్యోగులకు పెద్దగా ఉండదు. అవసరానికి పనికి రాదు అనే భ్రమలో అతను బతికేస్తుంటాడు. పోనీ అవసరమైనప్పుడు వెనక్కి తీసుకోవాలన్నా కూడా అది అంత సులవు కాదు. అందుకే మన దేశంలో PF విత్ డ్రా అనేది ఒక మహాయజ్ఞం అనే చెప్పాలి. సకాలంలో దాన్ని అందుకున్నవాడు మొనగాడే అనుకోవాలి.
ఎందుకింత కష్టం..?
ఉద్యోగాలు, వాటి స్వరూపాలు పూర్తిగా మారిపోయిన రోజులివి. గతంలో ఉద్యోగం మారాలంటే చాలా కాలం ఆలోచించేవారు. ఆ ఆలోచించేలోపే అవకాశం ఆవిరై పాత ఉద్యోగంలోనే స్థిరపడిపోయేవారు. కానీ రోజులు మారాయి. ఏడాదికో, ఏడాదిలోపో ఉద్యోగాలు మానేసేవారు చాలామందే ఉంటారు. మరి వారంతా ఉద్యోగం చేసినప్పుడు తమ PF ఖాతాల్లో ఉన్న సొమ్ముని మానేశాక తీసేసుకుంటున్నారా అంటే కచ్చితంగా ఔనని చెప్పలేం. ఇక్కడ ఇంకె రెమెడీ కూడా ఉంది. గతంలో తాను పనిచేసి మానేసిన కంపెనీ పీఎఫ్ నెంబర్ ని కొత్త కంపెనీకి ఇచ్చి దాన్ని కొనసాగించే వీలుంది. అయితే ఇది కూడా అంత సులభంగా జరగడం లేదు. ఫలితంగా వివిధ కంపెనీల్లో వివిధ పీఎఫ్ అకౌంట్లతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వానికి తెలియదా?
పీఎఫ్ కోసం ఉద్యోగులు పడే కష్టాలు ప్రభుత్వానికి తెలుసు. కానీ ఎన్నిసార్లు పీఎఫ్ నిబంధనలు మార్చినా అవి ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండటం లేదని అంటున్నారు. కొన్నిసార్లు నెలల తరబడి పీఎఫ్ సొమ్ముకోసం తిరిగినా అది అందదు, కొంతమంది ఏళ్లతరబడి పీఎఫ్ సొమ్ముకోసం పోరాటాలు చేసేవారు కూడా ఉన్నారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము, తాము దాచి పెట్టుకున్న సొమ్ము, తిరిగి తమ అవసరాలకు ఉపయోగపడకపోతే ఎలా అనేది వారి ప్రశ్న.
డేట్ ఆఫ్ ఎగ్జిట్ (DOE) అనేది పీఎఫ్ లో కీలకం. అయితే ఇక్కడ కంపెనీని యజమాని మూసివేస్తే, లేక కంపెనీలను విలీనం చేస్తేనో ఈ DOE సమస్యగా మారుతుంది. ఒకవేళ ఉద్యోగాన్ని వదిలేసిన కొన్ని సంవత్సరాల తర్వాత పీఎఫ్ కోసం ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యగా మారుతుంది. అప్పటికి యజమాని కంపెనీని మూసివేయవచ్చు, అవసరమైన పీఎఫ్ వివరాలు చెప్పే హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఉండకపోవచ్చు. ఇలా సమస్య ఏదయినా ఇబ్బంది పడేది మాత్రం ఉద్యోగే. ఉద్యోగుల రికార్డుల్లో ఉన్న తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్ లు, ఆధార్, పాన్ కార్డ్ లలో ఉన్న డేటా సరిపోలకపోవడం.. ఇలాంటి చిన్న చిన్న తప్పులే పీఎఫ్ సమస్యలను మరింత పెద్దవి చేస్తుంటాయి. కేవైసీ పూర్తి చేయకపోవడం, యాజమాన్యం తరపునుంచి అనాసక్తి కూడా కొన్నిసార్లు సమ్యలకు కారణం కావొచ్చు. కొన్నిసార్లు క్లెయిమ్ పరిష్కరించబడినట్టు మెసేజ్ లు వచ్చినా కూడా పీఎఫ్ సొమ్ము మన బ్యాంక్ ఖాతాల్లో జమ కాదు. అసలు ఆ సొమ్ము ఎక్కడికిపోయిందనే వివరం కూడా ఉండదు. పీఎఫ్ ఆఫీస్, బ్యాంక్.. రెండిట్లో ఎవరూ సమాధానం చెప్పలేరు. ఓటీపీ వైఫల్యాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లు సరిగా రాయకపోవడం, లేదా ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడంతో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. మొత్తమ్మీద భారత్ లో పీఎఫ్ విత్ డ్రా అనేది ఉద్యోగం తెచ్చుకోవడం కంటే అతి పెద్ద సవాల్ అనే చెప్పాలి.