 
					IRCTC Tour Package: భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మరోసారి భక్తులకు ఆధ్యాత్మికానుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. రెండు ధామాలతో సహ దక్షిణ భారత తీర్థయాత్ర పేరుతో ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఎన్ని రోజులు, ఏ ఏ దేవాలయాల దర్శనం చేయిస్తారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
ఈ యాత్రలో భాగంగా భక్తులు ముందుగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. శ్రీవారి క్షేత్రం ప్రతి హిందువు జీవితంలో తప్పక చూడాల్సిన పవిత్ర స్థలం. అనంతరం రామేశ్వరం పుణ్యక్షేత్రానికి ప్రయాణం ఉంటుంది. ఇక్కడ శ్రీ రామనాథస్వామి ఆలయ దర్శనం చేస్తారు. రామాయణంలో చెప్పబడినట్లుగా శ్రీరాముడు లంక యాత్రకు ముందు పూజలు చేసిన ఈ ప్రదేశం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది.
మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం
తదుపరి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. అద్భుతమైన శిల్పకళా వైభవంతో ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం దక్షిణ భారత సాంస్కృతిక ప్రతీక. ఇక్కడి గోపురాలు, శిల్పాలు, రంగులు ప్రతి భక్తుడి మనసును ఆకట్టుకుంటాయి. ఆ తరువాత కన్యాకుమారికి ప్రయాణం ఉంటుంది. భారతదేశం యొక్క దక్షిణ అంచున ఉన్న ఈ ప్రాంతం భౌగోళికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న కన్యాకుమారి అమ్మవారి ఆలయం, సముద్ర తీరంలోని వివేకానంద రాక్ మెమోరియల్ ఈ యాత్రకు మరింత మహిమను చేకూరుస్తాయి.
తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం
తర్వాతి క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. ఈ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనవంతమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడ స్వామివారి రూపం భక్తుల్లో భక్తి, శాంతిని కలిగిస్తుంది. రహస్య గర్భగుడి నిధులు, ఆధ్యాత్మిక మర్మం ఇవన్నీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం
ఇక మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ యాత్రలో మరో ప్రధాన ఆకర్షణ. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం జీవితంలో ఒక సారైనా తప్పక చేయాలనే ఆకాంక్ష ప్రతి భక్తుడిలో ఉంటుంది. ఈ యాత్రలో ఆ భాగ్యాన్ని కూడా పొందవచ్చు.
ప్రయాణంలో సౌకర్యాలు
భారత్ గౌరవ్ రైలు ఈ ప్రయాణానికి ప్రత్యేకంగా సిద్ధం చేయబడింది. రైలులో భక్తుల కోసం సౌకర్యవంతమైన వసతి, రుచికరమైన ఆహారం, గైడ్‌ల సహాయం వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. రైలు అంతర్గత భాగం భారతీయ సంస్కృతి, భక్తి వాతావరణంతో అలంకరించబడుతుంది. ప్రతి రోజు ఉదయం దేవాలయ సందర్శనలతో ప్రారంభమై, రాత్రి సాయంత్రం పుణ్యక్షేత్రాల్లో శాంతియుత వాతావరణంలో విశ్రాంతి లభిస్తుంది.
యాత్ర ఎప్పటి నుంచి
ఈ ఆధ్యాత్మిక యాత్ర ఒక్కో భక్తుడికి పుణ్యప్రాప్తి మాత్రమే కాకుండా, దక్షిణ భారత సాంస్కృతిక వైభవాన్ని దగ్గరగా అనుభవించే అద్భుత అవకాశం కూడా అవుతుంది. 2026 జనవరి 18న ప్రారంభం కానుంది. మొత్తం 14 రాత్రులు 15 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర భక్తుల్ని దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాలకు తీసుకెళ్తుంది. యాత్ర ధర ఒక్కో వ్యక్తికి రూ. 27,585 నుండి ప్రారంభమవుతుంది. బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ irctctourism.com/bharatgaurav ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తుండిపోయే పుణ్య సంధర్భం
ఈ యాత్రలో భక్తి, సంస్కృతి, సౌందర్యం, పుణ్యం అన్నీ కలిసిన ఒక అద్భుత అనుభవం ఉంటుంది. తిరుపతి నుండి శ్రీశైలం వరకు, రామేశ్వరం నుండి కన్యాకుమారి వరకు ప్రతి క్షణం దేవుని దయతో నిండిపోయిన ఈ యాత్ర, ఆధ్యాత్మిక ప్రియులకు జీవితాంతం గుర్తుండిపోయే పుణ్య సంధర్భంగా నిలుస్తుంది.