MP News: సమాజంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య యూపీలో భార్యని కోరుకున్న ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె భర్త. తాజాగా మధ్యప్రదేశ్‌లో మరొక వింత ఘటన చోటు చేసుకుంది. భర్త, ఐదేళ్ల కొడుకుని వదిలేసి కజిన్ సిస్టర్‌తో భార్య పారిపోయింది. చివరకు భార్య వాట్సాప్‌లో చాటింగ్ చూసి షాకయ్యాడు ఆమె భర్త. అసలేం జరిగింది?
అశుతోష్-సంధ్యలకు దాదాపు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ జంటకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే కొడుకు చదువు నిమిత్తం అశుతోష్ ఫ్యామిలీ జబల్పూర్‌లో నివాసం ఉంటోంది. సమీపంలో అశుతోష్‌కు వరసకు కజిన్ అవుతున్న మాన్సి తరచూ వారి ఇంటికి వచ్చేది. ఆ తర్వాత సంధ్య-మాన్సిలు క్లోజ్‌గా ఉండేవారు. వారిని చూసిన అశుతోష్‌కు ఎలాంటి అనుమానం రాలేదు.
ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి విహారయాత్రలకు, షాపింగులకు వెళ్లేవారు. ఇదిలా జరుగుతుండగా ఆగస్టు 12న సంధ్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. భార్య కోసం అశుతోష్ వెతికాడు. చివరకు జబల్పూర్ రైల్వే స్టేషన్లో కన్పించడంతో నచ్చజెప్పి భార్యని ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దిరోజులు బాగానే ఉండేది సంధ్య.
చివరకు ఆగస్టు 22న భర్త ఇంట్లో లేని సమయంలో కొడుకుని వదిలి వదినతో పారిపోయింది. ఈసారి తెలివిగా సంధ్య తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలేసింది. దీంతో సంధ్య ఆచూకీ తెలుసుకోవడం భర్త అశుతోష్‌కు కష్టంగా మారింది. భార్య గురించి ఎలాంటి జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త.
ALSO READ: టీవీకే సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి
జబల్పూర్ గ్రామీణ ప్రాంతంలోని ఘంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన మహిళ ఫోన్ తీసుకెళ్లకపోవడంతో ఆమెని ట్రాకింగ్ చేయడం కష్టంగా మారింది. కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అశుతోష్.. భార్య గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు.
భార్య ఆలోచనలో ఇంట్లో తిరుగుతుండగా సంధ్య ఫోన్ కనిపించింది. తొలుత నెంబర్లు పరిశీలించిన అశుతోష్, ఆ తర్వాత వాట్సాప్ చెక్ చేశాడు. మాన్సితో సంధ్య జరిపిన రొమాంటిక్ చాటింగ్ చూసి షాకయ్యాడు. మాన్సితో సంధ్య పారిపోయి ఉంటుందని అనుమానించి పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు.
ఈ వ్యవహారం బయటకు తెలియడంతో స్థానికులు షాకయ్యారు. దీనిపై రకరకాలుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఆ ప్రాంతవాసులు. ఓ మహిళ.. ఆమె వదిన మధ్య స్వలింగ సంపర్క సంబంధం బయటపడటంతో విస్తృత చర్చకు దారితీసింది. చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.