Jajpur: ఎండాకాలమా.. మరేదైనా కారణమా అనేది తెలీదు. నిన్న పుచ్చకాయ.. నేడు పెరుగు వడ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంతలో పెరుగు వడ తిన్నారు దాదాపు నాలుగు డజన్ల మంది. చివరకు వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగింది?
ఒడిషాలో దారుణం.. పెరుగు వడ తిని 30 మంది ఆసుపత్రిలో జాయిన్
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే చాలా ఊళ్లలో రోజుకో ప్రాంతంలో సంతలు జరుగుతుంటాయి. ఆయా సంతలకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినవారు, వారానికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తుంటారు. ఒడిషాలోని దశరథపూర్ సమితి పరిధిలోని పతాపూర్ గ్రామంలో సంత జరిగింది.
అక్కడ విక్రయించిన పెరుగు వడల(దహీ బరా)ను సుమారు 30 మందికి కొనుగోలు చేసి వాటిని తిన్నారు. వాటిని తీసుకున్న గంట తర్వాత వినియోగదారులకు అసలు సమస్య మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో 13 మంది చిన్నారులు.. రంగంలోకి వైద్య బృందాలు
వెంటనే వారిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి వారిని సమీపంలోని దశరథపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చికిత్స చేసినప్పటికీ బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జాజ్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించాలని స్థానిక డాక్టర్ తెలిపారు. బాధితుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు.
దీనిపై ఆ గ్రామంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి జిల్లా అధికారులు పతాపూర్ గ్రామానికి ఓ వైద్య బృందాన్ని పంపారు. బాధితులకు పరీక్షలు చేశారు. ఏమైనా వ్యాధి ఉందా? ఫుడ్ పాయిజన్ అయ్యిందా? కలుషితమైన నీరు అస్వస్థతకు కారణమా? ఇలా రకరకాల అంశాలను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు.
ALSO READ: కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 12 షాపులు దగ్ధం.. లక్షల్లో ఆస్తి నష్టం
ఆసుపత్రిలోని బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేశారు. కలుషిత ఆహారాన్ని విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఆహారం పాడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వినియోగదారులు బయట నుంచి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. రీసెంట్‌గా ముంబైలో పుచ్చకాయ తిని ఓ ఫ్యామిలీలోని నలుగురు సభ్యులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే.