Cocaine Queen Anmol: కొకైన్ క్వీన్, డ్రగ్స్ మాఫియా డాన్ అన్‌మోల్ అలియాస్ పింకీ అరెస్ట్ ఓ సంచలనమైతే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిందితురాలిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో కరాచీ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొకైన్ క్వీన్ పింకీకి రాచ మర్యాదలు
కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతోంది పింకీ. అనుకోకుండా కొన్నిరోజుల కిందట ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయల విలువైన కొకైన్‌తోపాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరాచీ పోలీసులు సాధించిన విజయం అంతలోనే ఆవిరైపోయింది.
ఫలితంగా వారి ప్రతిష్టలు మసకబారడం మొదలుపెట్టాయి. అన్‌మోల్‌ను న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచిన సమయంలో తీసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. నీలిరంగు టీ-షర్టు, ఊదా రంగు పలాజో ప్యాంటు ధరించిన ఆమె, చేతులకు సంకెళ్లు లేకుండా న్యాయస్థానం ముందు హాజరైంది. ఓ పోలీసు అధికారి ఆమెను గౌరవంగా న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించడం కలకలం రేపింది.
పరువు పోగొట్టుకున్న పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది సస్పెండ్
నిందితురాలికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పోలీసు శాఖపై ఆరోపణలు గుప్పుమన్నాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. ఫలితంగా కరాచీ పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు చీఫ్ జావేద్ ఆలం. అంతేకాదు నిందితురాలికి ఎస్కార్ట్‌గా వెళ్లిన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
నిందితుల విషయంలో నిర్దేశించిన నియమాలను ఎందుకు ఉల్లంఘించారో తేల్చేందుకు దర్యాప్తు చేయనుంది ప్రత్యేక విచారణ కమిటీ. మహిళా కొరియర్లు, మొబైల్ ప్రొడక్షన్ యూనిట్లను వినియోగిస్తూ చాన్నాళ్లుగా పోలీసుల కళ్లు గప్పింది అన్మోల్. ఆ విధంగా తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించింది. డ్రగ్ డాన్‌ను పట్టుకుని విజయం సాధించామనే కంటే, నిందితురాలికి ట్రీట్‌మెంట్ విషయంలో పోలీసుల శాఖ విమర్శల పాలైంది.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు