2026 మే 8, తనూజ రంజన్ హత్య అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, డీజీపీ ఆనంద్.. ఇద్దరూ సిటీ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ఇకపై ఎవరూ నేపాలీకి చెందిన వర్కర్లను తమ ఇండ్లలో పని మనుషులుగా పెట్టుకోవద్దని. దీనికి బలమైన కారణముంది.
తనూజ రంజన్.. రిఐర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య. ఇతను తన భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివాసముండేవాడు. భర్తలేని సమయంలో ఆ ఇంట్లోనే పనిచేసే నేపాలీకి చెందిన కల్పన సహకారంతో నేపాలీ ముఠా ఆమెను దారుణంగా హత్య చేసింది. ఈ కేసుతో లింకున్న పలువురి అనుమానులను అరెస్టు చేశారే తప్ప.. ఇంకా అసలైన నిందితులు దొరకలేదు. ఆ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ విధమైన పిలుపునిచ్చారు.
వీరిలా పిలుపునిచ్చిన మూడో రోజే మరో ఘటన..
మే,11 కౌకూరు, జవహార్ నగర పరిధి, సిటీ శివారులో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడీకి పాల్పడింది నేపాల్ ముఠా. ఈ దోపిడీలో ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషే కీలక నిందితురాలు. మరి కొందరు నేపాలీ ముఠాతో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. 60 తులాల బంగారం, 15 తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఐదు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన నిందితులందరినీ పట్టుకున్నారు.
తాజాగా ..
ఇదే ఏరియా పరిధిలో బొల్లారం ప్రాంతంలోని విల్లా ఆర్కిడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా ఫెర్నాండేజ్ మేజెస్ హత్య కేసు కలకలం రేపింది. ఇది చేసింది బీహారీకి చెందిన యువకుడు విక్రమ్. అతను అంతకు ముందు అక్కడే వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించాడు. ఆ బాలికను చంపి అక్కడే సెల్లార్ ప్రాంతంలో హత్యచేసి నీటి సంపులో పడేశాడు. పేరెంట్స్‌కు ఫోన్ చేసి 20 లక్షలు డిమాండ్ చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్థానికులు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా చేయడం ఉద్రికత్తకు దారి తీసింది.
జవహార్‌నగర్‌లో దోపిడీ జరిగిన తరువాత మల్కాజిగిరీ పోలీస్ కమిషనరేట్ పోలీసులు .. మీ సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆ కమిషనరేట్ పరిధిలో పనిచేసే గృహ కార్మికులు, కేర్ టేకర్లు, డ్రైవర్లకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి పెట్టుకున్నారు. 39,270 మంది గృహ కార్మికుల వివరాలు సేకరించగా.. ఇందులో 1,276 మంది నేపాలీకి చెందిన వారే ఉన్నారు. ఓ వైపు పోలీసు అధికారుల హెచ్చరికలు.. నగరంలో నమోదవుతున్న నేరాలు చూస్తే.. నేపాల్, బీహార్ ప్రాంతాలకు చెందిన వర్కర్లంటేనే జనం జడుసుకునేలా పరిస్థితులు తయారయ్యారు.
నగరం విస్తరిస్తున్న కొద్దీ.. ఇక్కడికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతుండటంతో చాలా మంది హైదరాబాద్‌పై ఆశలుపెట్టుకుని వస్తుంటారు. చిన్నదో పెద్దదో ఇక్కడే ఏదో ఒకటి ఉపాధి వెతుక్కుని ఇక్కడే ఏళ్ల తరబడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా నేపాల్, బీహార్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పనులు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. కానీ కొందరు చేసే కంచె చేను మేస్తే.. లాంటి చర్యలతో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వర్కర్లంటేనే ఖూనీ కోర్లుగా, దొంగలుగా చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
మల్కాజ్‌గిరీ కమిషనర్ చేపట్టినట్టుగా తమ పరిధిలోని అందరి వర్కర్ల పేర్లు, వారి ట్రాక్ రికార్డు సేకరించి పెట్టుకునే చర్య ఇలాంటి వాటికి పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. అదే సమయంలో ఏజెన్సీలు కొందరు తక్కువ వేతనాలకు ఎవరినో ఒకర్ని పెట్టేసుకుందాం..అని ఇలా చిరునామా లేని నేపాలీ, బీహారీలకు అవకాశాలివ్వడంతో నేరాలు చేసి పారిపోయేందుకు సులువైన మార్గాలుగా కొందరు ఈ రూట్‌ను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. చిన్నారి హత్య కేసులో ఇదే విధానం కనిపించింది.
స్థానికులు కూడా ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకోకుండా పనిలో వీరిని పెట్టుకోవడం, ఏజెన్సీలపై నమ్మకం పెట్టుకుని యజమానులు ఈ వర్కర్లను గుడ్డిగా నమ్మడం మూలంగా ఇలాంటి నేరాలకు ఆస్కారం దొరుకుతుందని తేలుతోంది. పోలీసులు ఏజెన్సీల పైనా కేసులు నమోదు చేస్తే ఇవి కంట్రోల్‌లోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.