Cyber Crime: నేటి డిజిటల్ యుగంలో అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఎంత సౌకర్యవంతమో, అంతకంటే ప్రమాదకరమైన ఆయుధంగా మారుతోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఒక ఏఎస్ఐ (ASI) సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వీడియో కాల్‌ను ఎత్తడమే ఆయన చేసిన పొరపాటైంది. అవతలి వ్యక్తులు ఆ వీడియోను రికార్డ్ చేసి, నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పరువు పోతుందన్న ఆందోళనతో ఆ అధికారి ఏకంగా రూ. 95,500 నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లించారు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ “సెక్స్‌టార్షన్” (Sextortion) ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు కేవలం సామాన్యులనే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, రాజకీయ నాయకులను కూడా వదలడం లేదు. వీరు ప్రధానంగా “హనీ ట్రాప్” పద్ధతిని వాడుతున్నారు. అందమైన యువతుల ఫోటోలతో సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం, మాటల్లో దించి వీడియో కాల్స్ చేయడం, ఆపై స్క్రీన్ రికార్డింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వీరి నిత్యకృత్యం. బాధితులు తమ సామాజిక హోదాను దృష్టిలో ఉంచుకుని బయట చెప్పుకోలేక, అడిగినంత డబ్బు ఇస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
కేవలం వీడియో కాల్స్ మాత్రమే కాదు, కేటుగాళ్లు రకరకాల మార్గాల్లో విరుచుకుపడుతున్నారు. కేవైసీ (KYC) అప్డేట్ పేరుతో బ్యాంక్ వివరాలు సేకరించడం, పార్ట్ టైమ్ జాబ్స్ అంటూ ఆశ చూపడం, అత్యల్ప వడ్డీకే లోన్ ఇస్తామంటూ యాప్‌ల ద్వారా వేధించడం వంటివి సర్వసాధారణం అయ్యాయి. ఈ నేరగాళ్లు భౌగోళిక సరిహద్దులు దాటి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూర్చుని, సాంకేతికతను వాడుకుంటూ మన కష్టార్జితాన్ని క్షణాల్లో దోచుకుంటున్నారు. జగిత్యాల ఘటనలో నిందితులు ఏకంగా ఒక పోలీస్ అధికారిని భయపెట్టగలిగారంటే వారి ధైర్యం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
మనం ఎంత చదువుకున్నాం, ఏ హోదాలో ఉన్నాం అన్నది సైబర్ నేరగాళ్లకు ముఖ్యం కాదు.. మనకున్న చిన్నపాటి అజాగ్రత్తే వారికి పెట్టుబడి. అందుకే సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను తిరస్కరించడం, తెలియని లింకులపై క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత ఫోటోలను పంచుకోకపోవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ పొరపాటున ఇలాంటి ఉచ్చులో చిక్కితే, భయపడి డబ్బులు పంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు సదా అది నేరగాళ్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అపరాధ భావన వీడి వెంటనే అధికారులను ఆశ్రయించడమే తెలివైన పని.
Also Read: ఏలూరు జిల్లాలో దారుణం.. భార్య గొంతు కోసి, తర్వాత భర్త..
సైబర్ మోసానికి గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు, ప్రజల్లో కూడా విస్తృత అవగాహన అవసరం. జగిత్యాల ఏఎస్ఐ బాధితుడిగా మారిన తీరు మనందరికీ ఒక హెచ్చరిక. స్మార్ట్ లోకంలో బ్రతుకుతున్న మనం సాంకేతికత పట్ల అప్రమత్తంగా లేకపోతే, ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ఎవరైనా బలికాక తప్పదు.
పోలీసులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ASI
ASIని బ్లాక్‌మెయిల్ చేసి రూ.95,500 దోపిడీ
జగిత్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో ఓ ASIకు వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు
ASI మాట్లాడిన వీడియో కాల్‌ను రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ… pic.twitter.com/Ief28tZLNF
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2026