Acid Attack Case New Twist: ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు షాకయ్యారు. కన్నతండ్రి.. కూతురితో కలిసి డ్రామా ఆడినట్టు తేలింది. దీని వెనుక పెద్ద కథ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలేం జరిగింది?
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు కొత్త మలుపు
ఢిల్లీలో ఆదివారం ఉదయం డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఘటన వెనుక మాస్టర్ మైండ్ బాధితురాలి తండ్రేనని తేలింది. దీంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి అకిల్‌ఖాన్ అత్యాచారం కేసు నమోదు అయ్యింది. దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఈ స్కెచ్ వేసినట్టు తేలింది.
ప్రత్యర్థిని ఈ కేసులో ఇరికించేందుకు కూతురితో కలిసి తండ్రి డ్రామా ఆడినట్లు అంగీకరించాడు నిందితుడు. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్తే.. అక్టోబర్ 24న యాసిడ్ దాడి కేసు తొలి నిందితుడు జితేందర్ భార్య అకిల్‌ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021-24 మధ్యకాలంలో తాను ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు అకిల్‌ఖాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రస్తావించింది.
కూతురుతో కలిసి తండ్రి స్కెచ్
అంతేకాదు అభ్యంతరకర ఫోటోలు, వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ప్రధానంగా పేర్కొంది. ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో జితేందర్‌ని ఇరికించాలని భావించి అకిల్ ఖాన్ తన కూతురితో కలిసి యాసిడ్ దాడి ప్లాన్ చేశాడు. చివరకు పోలీసుల విచారణలో ఆ కుట్ర భగ్నమైంది. అరెస్టు అయ్యాడు అకిల్‌ఖాన్.
యాసిడ్ దాడి గురించి పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. తండ్రి-కూతురు కలిసి టాయిలెట్ క్లీనింగ్ కోసం యాసిడ్‌ను కొనుగోలు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో లక్ష్మీబాయి కాలేజీ ప్రాంగణంలో జితేందర్, అతని ఫ్రెండ్స్‌తో బైక్‌పై వచ్చి యాసిడ్ పోశాడన్నది బాధితురాలు తొలి వెర్షన్. ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చేతులకు గాయాలు అయినట్టు పేర్కొంది.
ALSO READ: కర్నూలు బస్సు ప్రమాదం.. మూడు రోజుల తర్వాత తల్లి-కూతురు అంత్యక్రియలు
ఇక అక్కడి నుంచి స్టోరీని అల్లేసింది బాధిత యువతి. ఏడాదిగా జితేందర్ తనను వేధిస్తున్నాడని, గత నెలలో ఈ విషయమై వాగ్వాదం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించింది. బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగేశారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఘటన సమయంలో జితేందర్.. కరోల్‌బాగ్ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.
పోలీసులకు అనుమానం వచ్చి ఇంకాస్త లోతుగా విచారణ చేపట్టారు. తొలుత బాధిత యువతి కుటుంబసభ్యులను విచారించారు. అందులో యువతి తండ్రి అకిల్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అకిల్‌ఖాన్.. జితేందర్ స్నేహితులు ఇషాన్-అర్మాన్‌ల కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలున్నట్లు తేలింది. ఏడేళ్ల కిందట అంటే 2018లో అకిల్ బంధువులు తమపై యాసిడ్‌తో దాడి చేశారని ఇద్దరు కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం ఆ వివాదం విచారణలో ఉందని తెలిపారు. ఇషాన్, అర్మాన్‌లు ఆగ్రాలో ఉన్నారని, యాసిడ్ ఘటన కేసులో రేపోమాపో విచారణకు హాజరుకానున్నారు.