Medak News: కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామమైన మెదక్ మండలం శివ్వాయిపల్లిలో అంత్యక్రియలు జరిగాయి.
గత శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం జరుగగా బస్ లో సజీవ దహనమైన వారి డెడ్ బాడీలు గుర్తు పట్టలేని విధంగా మారడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం ఆదివారం సాయంత్రం డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన మూడు రోజుల తర్వాత కర్నూల్ నుంచి అంబులెన్స్ లో డెడ్ బాడీలు ఆదివారం అర్ధరాత్రి శివ్వాయిపల్లికి చేరుకున్నాయి. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ALSO READ: Riyaz encounter: నిజామాబాద్ పోలీస్ హత్య కేసు.. హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు
తల్లీ కూతుళ్లకు ఒకేసారి తండ్రి కొడుకులు ఆనంద్ గౌడ్, శ్రీవల్లభ తల కొరివి పెట్టడం అందరిని కంట తడి పెట్టించింది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన తండ్రి కూతురుకు తల కొరివి పెట్టడం అక్కడున్నవారిని కలిచివేసింది. తల్లీ కూతుళ్ల మృతితో నాలుగు రోజులుగా గ్రామంలో విషాదం అలుముకోగా, వారి అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరైన బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు బోరున విలపించారు.
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కంటారెడ్డి, తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు వాల్దస్ మల్లేశం గౌడ్, మాజీ ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య తదితరులు హాజరై మృతులు సంధ్యారాణి, చందన మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.