Delhi News: భార్యభర్తల మధ్య విభేదాలు ఎంతటికైనా దారి తీస్తాయి. చంపుకునే ఘటనలు క్రమంగా తీవ్రమవుతున్నాయి. కానీ ఆ ఇల్లాలు అలా చేయలేదు. బతికి ఉండగానే భర్తకు నరకం చూపించింది. నిద్ర పోతున్న భర్తపై వేడిగా మరిగిన నూనె వేసింది. ఆ తర్వాత కారం జల్లింది. సంచలనం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
భార్యభర్తల మధ్య చిచ్చు
ఢిల్లీలో మదన్‌గిరి ప్రాంతానికి చెందిన దినేష్‌కు వివాహం జరిగింది. పెళ్లి జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది కూడా. వివాహం జరిగిన ఏడాది నుంచే ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు తారాస్థాయికి చేరాయి. తప్పు ఎవరిది అన్నవిషయం కాసేపు పక్కనబెడదాం. రెండేళ్ల కిందట తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య.
అయినా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 2న రాత్రి దినేష్ గురకపెట్టి నిద్రపోతున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దినేష్ శరీరంపై మంట రావడంతో కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి కనిపించడంతో షాకయ్యాడు.భర్తపై వేడి వేడి నూనె పోస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో లేవడానికి ప్రయత్నం చేశాడు. ఈలోగా కేకలు పెట్టాడు. వెంటనే కారం పొడి చల్లింది.
భర్తకు నూనెతో నరకం చూపించిన భార్య
దీంతో ఆ మంట తట్టుకోలేకోపోయాడు దినేష్. నువ్వు అరిచావంటే.. ఇంకా వేడి నూనె మీద పోస్తానని భార్య బెదిరించింది. భరించలేని నొప్పితో అరవడం కంటిన్యూ చేశాడు. దినేష్ అరుపులు విన్న ఇంటి ఓనర్, అతడి కూతురు దినేష్ ప్లాట్‌కి వచ్చారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో ఓపెన్ కాలేదు. తలుపు తెరవమని పలుమార్లు చెప్పడంతో చివరకు తలుపు తెరుచుకున్నాయి.
దినేష్ అప్పటికే నొప్పితో విలవిల్లాడుతున్నాడు. భార్య ఇంట్లో ఏదో పని చేస్తున్నట్లు నటిస్తోంది. దినేష్‌ను ఇంటి ఓనర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించాడు. ఈలోగా భార్య అడ్డుకుంది. తాను తీసుకెళ్తానని ఇంటి బయటకు వచ్చింది. ఆసుపత్రి వైపు కాకుండా వేరే వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అనుమానం వచ్చిన ఇంటి ఓనర్ ఆటో ఆపి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ALSO READ: గోదావరి ఎక్స్ ప్రెస్‌లో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
దినేష్‌కి తీవ్రగాయాలు కావాడంతో స్థానిక డాక్టర్ సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం సఫ్‌దర్‌జంగ్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు దినేష్. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దినేష్ భార్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.