Karnataka Crime News: దేశంలో నేరాలు క్రమంగా పెరుగుతున్నాయా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఏం చెబుతోంది? వరకట్నం సంబంధిత కేసులు పెరుగుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పెళ్లయిన నాలుగు నెలలకే భార్యని అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆమె భర్త. దీని వెనుక అదనపు కట్నం వేధింపులే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ కేసులో అసలేం జరిగింది?
దేశంలో పెరుగుతున్న క్రైమ్ కేసులు
కర్ణాటకలోని బెలగావి జిల్లా కమలాదిన్ని ప్రాంతంలో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం చేసుకున్న నాలుగు నెలలకే భార్యని హత్య చేశాడు ఆమె భర్త. మృతదేహాన్ని మంచం కింద దాచి పెట్టాడు. సైలెంట్‌గా ఇంటి నుంచి పారిపోయాడు. కర్ణాటకలోని బెలగావి జిల్లా కమలాదిన్ని గ్రామానికి చెందిన ఆకాశ్ కాంబర్-సాక్షికి మే నెలలో వివాహం జరిగింది. పెళ్లిసమయంలో కట్న కానుకల కింద అల్లుడికి ఇవ్వాల్సిన లాంఛనాలు ఇచ్చారు అత్తింటివారు.
పెళ్లైన కొత్తలో ఈ జంట అన్యోన్యంగా కనిపించింది. ఈ దంపతులను చూసి బంధువులు చుట్టుపక్కల వారు తమకు అలాంటి కూతురు-అల్లుడి ఉంటే బాగుండేదని ఊసులాడుకునేవారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. పనుల నిమిత్తం సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అంతా వెతికింది.
భార్యని చంపి, మంచం కింద పెట్టి
మంచం కింద చూడగా కోడలు విగత జీవిగా చూసి వెంటనే షాకైంది. కొడుకు ఎక్కడా కనిపించలేదు. కాసేపు ఆలోచించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇళ్లంతా వెతికారు. కానీ సాక్షి భర్త ఆకాశ్ ఎక్కడ కనిపించలేదు. బహుశా భర్త ఆకాశ్.. భార్యని హత్య చేసి పరారై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతడి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి మరణం విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు షాకయ్యారు. అదనపు కట్నం కోసం సాక్షిని చంపేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కన్నీరుమున్నీరు అయ్యారు. ఫోరెన్సిక్ బృందాలు, స్థానిక అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ALSO READ: కల్తీ దగ్గుమందు కేసు.. ఫార్మా కంపెనీ అధినేత అరెస్ట్
నేరం వెనుకున్న ఉద్దేశ్యాన్ని నిర్ధారించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల యూపీలోని మెయిన్‌పురి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. కట్నం కోసం భార్యని ఆమె భర్త , అత్తమామలు కొట్టి చంపిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.