Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విధులను నిర్వహిస్తున్న సమయంలోనే ఓ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 యూపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ -స్కూల్ అసిస్టెంట్ గా సుజాత విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం టీచర్ సుజాత పాఠశాలకు చేరుకున్నారు. ఎప్పటిలాగే, ఆమె విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లారు. అయితే, విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలోనే సుజాతకు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పిని భరించలేక ఆమె కుర్చీలో ఒక్కసారిగా కూలబడ్డారు. ఉపాధ్యాయురాలి పరిస్థితిని గమనించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే టీచ్ సుజాతను చికిత్స నిమిత్తం జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో.. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే, సంగారెడ్డికి తరలించే మార్గమధ్యంలోనే సుజాత గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు, తోటి ఉపాధ్యాయులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే టీచర్ సుజాత అకస్మాత్తుగా మరణించడంతో పాఠశాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుజాత మృతి పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ALSO READ: Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం
మృతురాలు సొంత గ్రామం కోహిర్ మండలం పగిడి గుమ్మల్ విలేజ్. ఈ రోజు సాయంత్రం స్వగ్రామంలో గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.