Cough syrup row: దేశవ్యాప్తంగా కలకలం రేపింది కల్తీ దగ్గు మందు వ్యవహారం. ఈ కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ ఓనర్ రంగనాథన్ అరెస్ట్ అయ్యారు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ దగ్గు మందు కేసు
కల్తీ దగ్గు మందు కేసులో 20 మంది చిన్నారుల మృతికి కారణమైన కోల్డ్రిఫ్ సిరప్ తయారు సంస్థ శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని రంగనాథన్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్ చేసిన ఆయన, నాలుగు దశాబ్దాలుగా ఔషధ తయారీ విభాగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్ సిరప్ ద్వారా ఆయన లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
ఆ తర్వాత ముక్కు డ్రాప్స్, చిన్న స్థాయి తయారీ యూనిట్‌ని చెన్నై పరిసరాల్లో మొదలుపెట్టారు. ఇటీవల మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసన్ పార్మా సంస్థపై కేసు నమోదైంది. ఈ క్రమంలో కోడంబాక్కంలోని రంగనాథన్‌ఆఫీసుని అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసి పలు రాష్ట్రాలకు పంపింది.
ఫార్మా కంపెనీ అధినేత అరెస్టు
సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కలిపి దాదాపు 20 మంది చిన్నారులు మరణించినట్టు వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్డ్‌రిఫ్‌ను నిషేధించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాదు మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ALSO READ: గోదావరి రైలులో ప్రయాణికుడికి గుండెపోటు
దేశంలోని చాలా రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు మందును నిషేధించాయి. చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు నివారించడానికి ఈ సిరప్‌ని వినియోగిస్తారు. ఇటీవలకాలంలో ఆ మందుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తమిళనాడు అధికారులు సాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయించారు. అందులో డైఈథిలీన్ గ్లైకాల్-DEG అనే పదార్థం మోతాదుకు మించి ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
ఇది పిల్లల్లో కిడ్నీలను డ్యామేజ్ చేసి మరణాలకు దారి తీసిందని చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌ట్‌మెంట్ తనిఖీల తర్వాత శ్రేసన్ యూనిట్‌ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని అధికారులు తేల్చారు. లైసెన్స్‌ను రద్దు చేసిన విషయం తెల్సిందే.
శ్రేసన్ ఫార్మా కంపెనీ అధినేత రంగనాథన్‌ను బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత చెన్నై నుంచి మధ్యప్రదేశ్ కు ఆయన్ని తరలించనున్నారు పోలీసులు. చింద్వారా జిల్లాకు తీసుకెళ్లి విచారించనున్నారు.
శ్రేసన్ ఫార్మా 1990లో తొలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ కంపెనీని రిజిస్టర్ నుండి తొలగించినట్టు దర్యాప్తులో తేలింది. ఐనప్పటికీ ఆ కంపెనీ పని చేయడంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.