Donald Trump: భారత్‌తో దెబ్బతింటున్న సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు లేఖ రాశారు 19 మంది అమెరికా చట్టసభ సభ్యులు. భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
టారిఫ్స్ పెంపుతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి..
మీ పరిపాలనలో తీసుకుంటున్న చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయన్నారు. ఇది ఇరు దేశాలకు ప్రతికూల పరిణామాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ఈ కీలక భాగస్వామ్యాన్ని సరిదిద్దడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ లేఖలో స్పష్టం చేశారు.
అమెరికా వినియోగదారులపై ధరల భారం పడుతోందని లేఖ
ట్రంప్ సర్కార్ పెంచిన సుంకాలతో భారత తయారీదారులను దెబ్బతీశాయని.. అమెరికా వినియోగదారులపై ధరల భారం పడుతోందని తెలిపారు. అమెరికన్ కంపెనీలు ఆధారపడే సప్లయ్ చైన్స్ దెబ్బతింటున్నాయని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ముప్పు తెచ్చిపెడుతుందని చట్టసభ సభ్యులు హెచ్చరిక
సెమీ కండక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వరకు అనేక కీలక రంగాలలో అమెరికా తయారీదారులు భారత్‌పై ఆధారపడి ఉన్నారని వివరించారు. ఈ సుంకాల పెంపు ఇరు దేశాల్లో లక్షలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చిపెడుతుందని హెచ్చరించారు.
భారత కంపెనీలు బిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగావకాశాలు..
ఇండియాలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వినియోగదారుల మార్కెట్లలో ఒకదానిగా నిలుస్తాయని ఎంపీలు తెలిపారు. అదే సమయంలో భారత కంపెనీలు బిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగావకాశాలను ఇస్తున్నాయన్నారు. విచక్షణారహిత టారిఫ్స్ పెరుగుదల భారత్‌తో సంబంధాలను ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కుటుంబాల ఖర్చులను పెంచుతుందని.. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే అమెరికన్ కంపెనీల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది హెచ్చరించారు. విప్లవాత్మక ఆవిష్కరణలు, సహకారాన్ని తగ్గిస్తుందని తెలిపారు.
Also Read: కలర్ డబ్బా తేస్తేనే.. స్కూల్‌లోకి ఎంట్రీ.. ప్రిన్సిపాల్ వింత పనిష్‌మెంట్
రష్యా, చైనాకు భారత్‌ను దగ్గర చేసిందన్న ఎంపీలు
అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా.. రష్యా, చైనాలతో భారత్ తన దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంచుకునేలా ఒత్తిడి చేశాయన్నారు ఎంపీలు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి ‘క్వాడ్’ కూటమిలో అమెరికాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి.. ఇలాంటి సమయంలో తమ చర్యలు భారత్‌ను దూరం చేసేలా ఉండకూడదని హితవు పలికారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప.. ఘర్షణ వైఖరి తగదని ట్రంప్‌కు సూచించారు అమెరికా చట్టసభ సభ్యులు.