Road Accidents: ఘోరం.. తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు.. ఒకే సమయంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో నలుగురి దుర్మరణం.
చిత్తూరు జిల్లాలో విషాదం..
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో శనివారం తెల్లవారుజామున ఒక భీకర ప్రమాదం సంభవించింది. శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును, వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, వారి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
మరో రోడ్డు ప్రమాదం..
మరోవైపు వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద గుండెల్ని పిండేసే ఘటన వెలుగు చూసింది. దుబాయ్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి భయపడి, ప్రాణాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతో మూడు రోజుల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనగామ జిల్లా సాగరం గ్రామానికి చెందిన తరుణ్, తన తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ క్రమంలో తరుణ్ లారీ చక్రాల కింద పడి మృతి చెందాడు.
కళ్లెదుటే కుమారుడి మరణం.. తల్లి రోదన..
తరుణ్ మరణంతో ఆ తల్లి ఆక్రందనలు మిన్నంటాయి. సుదూర ప్రాంతం నుండి క్షేమంగా తిరిగి వచ్చిన కొడుకు, తన కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆమె కన్నీరుమున్నీరవుతోంది. దుబాయ్ నుండి క్షేమంగా వచ్చిన కుమారుడు ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సమాచారం అందుకున్న ఐనవోలు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.
చిన్న అజాగ్రత్తే నిండు ప్రాణాలు తీస్తోంది..
ఈ రెండు ఘటనలు రహదారి భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డు పక్కన వాహనాలను నిలిపేటప్పుడు సరైన హెచ్చరికలు లేకపోవడం, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల పచ్చని కుటుంబాల్లో చీకటి నిండుతోంది. అటు చిత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ఇటు వరంగల్‌లో తల్లికి ఆసరాగా ఉండాల్సిన యువకుడు మరణించడం స్థానికంగా పెను విషాదాన్ని మిగిల్చింది.
వరంగల్ జిల్లా పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
లారీ కింద పడి తరుణ్ అనే యువకుడు మృతి
యుద్ధ భయంతో మూడు రోజుల క్రితమే దుబాయ్ నుండి వచ్చిన తరుణ్
తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుండి ఢీకొట్టిన లారీ
మృతుడు జనగామ జిల్లా సాగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా… pic.twitter.com/SdEl9bue8G
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2026