Suryapet: ప్రేమ.. ఆపై పెళ్లి.. ఒకరినొకరు హాయిగా జీవించాల్సిపోయి ఆ దంపతుల మధ్య విబేధాలు పొడచూపాయి. ఫలితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నడిరోడ్డుపై వెంటాడి కత్తితో పొడిచి చంపాడు ఆమె భర్త. సంచలనం రేపిన ఈ ఘటన సూర్యాపేట్ జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
సూర్యాపేట్ జిల్లా కోదాడలో దారుణమైన ఘటన
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని బాబునగర్ ప్రాంతంలో ఉంటోంది మణిదీప్ ఫ్యామిలీ. అతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆరేళ్ల కిందట ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శిరీషను ప్రేమించాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే శిరీష చిన్నతనంలో పేరెంట్స్ చనిపోవడంతో కోదాడలోని తన పిన్ని ఇంట్లో ఉండేది.
మణిదీప్-శిరీషా దంపతులకు రెండేళ్ల బాబు ఉన్నాడు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాది కిందట గొడవ జరిగింది. పెద్దల సమక్షంలో ఆ దంపతుల వివాదాన్ని పరిష్కరించారు. రెండు రోజుల కిందట ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
వెంటాడి మరీ భార్యని నడిరోడ్డుపై చంపిన భర్త
అది కాస్తా బుధవారం నాటికి తారాస్థాయికి చేరింది. దీనిపై శిరీషతోపాటు పెద్దమ్మ, భర్త కోదాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపేశారు. బయటికి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కింది. భార్య శిరీషను ఆటోలో నుంచి భర్త లాగటంతో ప్రాణ భయంతో రోడ్డు పక్కనున్న టీ స్టాల్ వద్దకు పరుగెత్తింది.
అందరూ చూస్తుండగా కత్తితో వెంటాడిన భార్యని చంపేశాడు భర్త మణిదీప్. స్థానికులు మణిదీప్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో శిరీషను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. శిరీష మృతి చెందినట్లు చెప్పారు.
ALSO READ: కోదాడ వద్ద ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్ లో 30 మంది ప్రయాణికులు
మణిదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మణిదీప్.. భార్యని కత్తితో పొడుస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా మణిదీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.