హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ దారుణ ఘటన చోటుచేసుకుంది. హుస్సేన్ సాగర్ లో పురుషుడి మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న లేక్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యలు జరుగుతుంటాయి.. కానీ ఈ వ్యక్తి శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే ఇది కేవలం ఆత్మహత్యేనా..? లేక మరేదైనా కుట్ర దాగి ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హత్య అనే కోణంలో దర్యాప్తు..
మృతదేహంపై ఉన్న గాయాల తీవ్రతను బట్టి.. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అతడిని మరేదైనా ప్రాంతంలో కొట్టి చంపి, ఆధారాలు కనుమరుగు చేసేందుకు హుస్సేన్ సాగర్‌లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నమూనాలను సేకరించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు నగరంలోని మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలింపు..
మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు. లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, సాగర్ పరిసరాల్లోని సిసిటివి కెమెరాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ALSO READ: DCM Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణపై కొత్త పలుకులు..