Chit Fund Dispute: డబ్బు మనుషుల మధ్య బంధాలను తెంచడమే కాదు, ప్రాణాలను కూడా తీస్తుందనే చేదు నిజం జగిత్యాలలో జరిగిన ఓ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రూ. 12,000 చిట్టి డబ్బుల కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. చిట్టి డబ్బులు తిరిగి అడిగినందుకు తండ్రీకొడుకులు కలిసి వ్యాపారిని చితకబాది హత్య చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లె ప్రాంతానికి చెందిన కొలగాని అంజయ్య (53) ప్రైవేట్‌గా చిట్టి వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. అదే పట్టణంలోని గణేష్ నగర్‌కు చెందిన దాసోజు శ్రీను అనే వ్యక్తి అంజయ్య వద్ద రూ. 1,00,000 (లక్ష రూపాయలు) చిట్టి వేసుకున్నాడు. చిట్టి ఎత్తుకున్న తర్వాత డబ్బుల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బకాయి ఉన్న రూ. 12,000 చెల్లించాలని అంజయ్య.. శ్రీనును నిలదీశాడు.
డబ్బుల కోసం అంజయ్య తరచూ అడుగుతుండటంతో, తనను వేధిస్తున్నాడని శ్రీను కోపం పెంచుకున్నాడు. ఇదే కోపంతో శ్రీను, అతని కొడుకు దాసోజు వేణుతో కలిసి ప్లాన్ వేశారు. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో అంజయ్య కనిపించగానే, తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మూకుమ్మడిగా చితకబాదారు.
తీవ్ర గాయాలపాలైన అంజయ్యను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయాలు తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజయ్య తుదిశ్వాస విడిచాడు. డబ్బు కోసం మొదలైన గొడవ చివరకు హత్యగా మారడంతో మృతుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితులపై దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ.. అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు