Gold robbery crime: ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నవాళ్లు ఓ చిన్న అలవాటు వల్ల బుక్కయ్యారంటే ఎలా ఉంటుంది? పక్కా ప్లాన్ తో చోరీ చేసిన వారు, కేవలం 30 రూపాయల పావ్ బాజీ ప్లేట్ వల్లే దొరికిపోయారు. ఈ కథలో ట్విస్ట్ మొదలైంది వీధి ఫుడ్ స్టాల్ వద్ద నుంచే.. అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని కలబురగి నగరంలో ఇటీవల ఒక గోల్డ్ దోపిడీ జరిగింది. ప్లాన్ అంతా సినిమాలా పర్ఫెక్ట్‌గా వేసుకున్నారు దొంగలు. టైమ్ చూసుకున్నారు, టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మన దొంగతనం చరిత్రలో మైలు రాయిలా నిలుస్తుందని అనుకుని నలుగురు కలసి గోల్డ్ షాప్‌కి బయలుదేరారు. కానీ, ఒక చిన్న పావ్‌భాజీ వల్ల ఈ గ్యాంగ్ అంతా పోలీసులకు చిక్కింది.
❂ దొంగల మాస్టర్ ప్లాన్ ఇదే
జూలై 11 ఉదయం.. కలబురగిలోని మారతుల్లా మాలిక్ జ్యువెలరీ షాప్ లక్ష్యంగా ఈ గ్యాంగ్ దాడి జరిగింది. ఫరూఖ్ అహ్మద్ మాలిక్ అనే దొంగ (40) ఈ ప్లాన్ వెనుక మాస్టర్‌మైండ్. పక్కా రూట్ ప్లాన్ వేసుకున్నాడు. నేను బయట కాపలా కాస్తా, మీరు ముగ్గురు లోపల క్లీన్‌గా పని ముగించండి అన్నాడు. అయోధ్య ప్రసాద్ చౌహాన్ (48), సోహైల్ షేక్ అలియాస్ బాద్షా, మరో స్థానిక నేరస్థుడు.. వీళ్ళు ముగ్గురూ గన్స్‌తో లోపలకి చొరబడ్డారు. యజమాని చేతులు కాళ్లు కట్టి, లాకర్ ఓపెన్ చేసి బంగారం, క్యాష్ ఎత్తుకుపోయారు.
పోలీసులకు మొదట 805 గ్రాముల బంగారం దొంగిలించారని షాప్ యజమాని చెప్పాడు. కానీ నిజానికి 3 కిలోల బంగారంను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తేలింది. తన దగ్గర ఉన్న అకౌంట్‌లో లేని బంగారం బయటపెడితే ఇబ్బందులు వస్తాయని షాపు యజమాని మారతుల్లా మాలిక్ మొదట నిజం దాచేశాడు.
❂ ఫరూఖ్ కు.. పావ్‌భాజీ పిచ్చి!
ఇదంతా చేసి సేఫ్‌గా పారిపోవాల్సింది బదులు, ఫరూఖ్ పావ్‌భాజీ తినాలని ఆగిపోయాడు. స్నాక్ స్టాల్‌కి వెళ్లి కూర్చున్నాడు. 30 రూపాయల పావ్‌భాజీ తిన్నాడు. ఇంతవరకు సరే కానీ, ఫోన్‌పే ద్వారా పేమెంట్ చేశాడు. ఆ డిజిటల్ ట్రైల్, సీసీటీవీ ఫుటేజ్.. ఇవే పోలీసులు గ్యాంగ్ దాకా చేరడానికి కారణమయ్యాయి. పోలీసులు CCTV లో ఫరూఖ్‌ను గుర్తించారు. 30 రూపాయల బిల్లు అతడిని బట్టబయలు చేస్తుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి.
❂ ఎందుకు ఈ దోపిడీ?
ఫరూఖ్ ఒకప్పుడు గోల్డ్‌స్మిత్. కానీ వ్యాపారంలో భారీ నష్టాలు. అప్పులు 40 లక్షలకు పెరిగిపోయాయి. ఈ దోపిడీ చేస్తే జీవితంలో తిరిగి లెవల్ అవుతానని అనుకున్నాడు. కానీ, కర్మ అంటే ఇది.. పావ్‌భాజీ తినడమే అతని ప్లాన్‌ను కూల్చేసింది.
❂ పోలీసుల ఆపరేషన్.. లూటీ రికవరీ
కలబురగి పోలీస్ కమిషనర్ ఎస్.డి. శరణప్ప నేతృత్వంలో స్పెషల్ టీమ్ దొంగల వెనుకపడి, 2.865 కిలోల బంగారం, రూ. 4.80 లక్షల క్యాష్ రికవర్ చేసింది. కొంత బంగారం కరిగించేశారు గానీ ఎక్కువ భాగం సేఫ్‌గా తిరిగి దొరికింది. మారతుల్లా మాలిక్ కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఉన్నాడు. మొదట నిజం చెప్పకపోవడం వల్ల అతనిపై కూడా విచారణ సాగుతోంది.
❂ సినిమాలా ఫినిష్..
ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, సీసీటీవీ ఫుటేజ్‌లో ముగ్గురు దొంగలు లోపలికి వెళ్లి బయటకి వచ్చి ఫరూఖ్‌తో మాట్లాడడం కూడా రికార్డ్ అయింది. తర్వాత అందరూ కలసి పారిపోయారు. కానీ, ఆ పావ్‌భాజీ బిల్ పోలీసుల పాలిట వరంగా మారింది. దొంగలు ఎంత తెలివైన ప్లాన్ వేసుకున్నా, ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టుబడడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.