Tamil Nadu: తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు స్వలింగ సంపర్కుల ప్రేమకలాపాలు చిన్నారి ప్రాణం తీసిన ఘటనలో పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు
వివరాల్లోకి వెళితే.. కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామంలో సురేష్, భారతి దంపతులు ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, 5 నెలల బాలుడు ఉన్నారు. రెండు రోజుల క్రితం కుమారుడు మృతి చెందాడు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఊపిరాడక చనిపోయాడని భార్య చెప్పడంతో, సహజ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే భర్త సురేష్‌కి అనుమానం రావడంతో, భార్య సెల్‌ఫోన్‌లో ఫోటోలు చూసి షాకయ్యాడు. అందులోని ఫోటోలను బట్టి తన భార్య భారతి, సుమిత్ర అనే యువతి స్వలింగ సంపర్కులు అని తెలిసి ఖంగుతిన్నాడు. దీంతో శిశువు మరణంలో అనుమానం ఉందని, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సురేష్.
Read Also: Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్
కొన్ని రోజుల క్రితం సురేష్ తో గొడవ కారణంగా భారతి కుంతుమారణపల్లి గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లగా, కుటుంబ సభ్యుల జోక్యంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చారని పోలీసు అధికారి తెలిపారు. సురేష్, ఇతర కుటుంబ సభ్యులు పనికి వెళ్లిన సమయంలో భారతి ఆ పసికందును ఊపిరాడకుండా చేసి చంపిందని ఫిర్యాదులో సురేష్ పేర్కొన్నాడు.
ఈ కేసులో సుమిత్ర ప్లాన్ ప్రకారమే భారతి చిన్నారిని చంపినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కెలమంగళం పోలీసులు సురేష్ భార్య భారతి, ఆమె అవివాహిత స్నేహితురాలు సుమిత్రలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బిడ్డ మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు.ఈ ఘటన కెలమంగళం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.