చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిశారు కాబట్టే గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఘన విజయం సాధించిందనే విషయం అందరికీ తెలుసు. ఆ కలయిక వల్ల తమకు నష్టం జరిగిందని ఇప్పటికీ వైసీపీలో చాలామంది బాధపడుతుంటారు. కానీ పైకి మాత్రం కూటమి వల్ల తమకేమీ నష్టం లేదని అంటుంటారు. తాజాగా అంబటి రాంబాబు కూడా అదే అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉండటం వల్ల తమకు మరింత లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
15 ఏళ్లు కలసి ఉంటాం..
ఇటీవల పవన్ కల్యాణ్ రాజకీయ సభల్లో అయినా, అధికారిక సభల్లో అయినా కూటమి బలంగా ఉండాలని, మరో 15 ఏళ్లపాటు కూటమి ఏపీలో అధికారంలో ఉండాలని చెబుతూ వచ్చారు. ఈ వ్యవహారం వైసీపీకి రుచించడం లేదు. కూటమిలో లుకలుకలు రావాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆమధ్య మంత్రి నారాయణ వ్యాఖ్యల్ని చినికి చినికి గాలివానలా మార్చాలని చూశారు. కానీ వెంటనే కూటమి నేతలు సర్దుకున్నారు. ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ లోకల్ నాయకులకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ కూటమిలో విభేదాలు రాకుండా చూసుకుంటున్నారు. దీంతో వైసీపీకి మరింత భయం పట్టుకుంది. అయితే అంబటి రాంబాబు వంటి నేతలు మాత్రం కూటమి కలసి ఉంటేనే తమకు లాభం అని చెబుతున్నారు. ఆ వ్యాఖ్యల్లో లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి.
కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా 2029 ఎన్నికలనాటికి ఎంతో కొంత సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతుంది. కూటమి ఒక్కటిగా ఉంటే ఆ ఓట్లన్నీ వైసీపీకే గంపగుత్తగా పడతాయనే ఆలోచన వారిలో ఉంది. ఒకవేళ జనసేన కూటమి నుంచి బయటకు వస్తే మాత్రం రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. అందుకే వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అధినాయకుడు జగన్ కూటమి రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కాపు వర్గానికి చెందిన వైసీపీ నేతలు మాత్రం పవన్ కల్యాణ్ ని సామాజిక వర్గం పేరుతో బ్లాక్ మెయిల్ చేసే వ్యాఖ్యలు ముమ్మరం చేశారు. కాపు ఓట్లన్నీ పవన్ కల్యాణ్, చంద్రబాబుకి వేయించారని చెబుతున్నారు. చంద్రబాబుని పవన్ భుజాన మోస్తున్నారని, ఇప్పుడు కొత్తగా లోకేష్ ని కూడా భుజానికెత్తుకున్నారంటూ అంబటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. అయితే పవన్ మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎక్కడా రియాక్ట్ కావడం లేదు. ఆమధ్య నెల్లూరు జిల్లాలో కాపు వర్గానికి చెందిన ఓ వ్యక్తి హత్య విషయంలో కూడా కుల రాజకీయాలకు వైసీపీ ప్రయత్నించింది కానీ, ఫలితం లభించలేదు.
Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..
నవ్యాంధ్రలో కూటమిదే విజయం అని గత మూడు ఎన్నికలు రుజువు చేశాయి. 2014లో ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో విడిపోయి మూడు పార్టీలూ ఇబ్బంది పడ్డాయి. తిరిగి 2024లో కలసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం రుజువైంది. దీన్నిబట్టి కూటమి పార్టీలలో లోలోపల ఎన్ని విభేదాలున్నా 2029లో మాత్రం కలసి పోటీ చేయడం ఖాయం. ఆ ప్రభావం వైసీపీపై పడకుండా ముందుగానే కూటమిని బలహీనం చేసే ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాటి ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి.
Also Read: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్