ఇటీవల కాలంలో హంతకులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. హత్య చేసిన తర్వాత కసిదీరా తలను వేరుచేసి దాన్ని సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు కొందరు. మరికొందరు రక్తపు తడి ఆరని కత్తిని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి చేతికి బేడీలు వేయమంటున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఉదాహరణ వీటన్నిటికంటే ఇంకా భయంకరమైనది. అతడు మాయం చేసింది ఒకటీ అరా శవాలను కాదు. అసలు ఎన్ని శవాలను అతడు పారేసి ఉంటాడో అతడికే తెలియదు. హత్య చేసి, తనకు శవం అప్పగిస్తే పారేసే డ్యూటీ తనది అని, అలా లెక్కలేని శవాలను మాయం చేసి హంతకులకు సాయం చేశానంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఈ ఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలో జరిగింది.
భయంతోనే..
ధర్మస్థల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ తన ఫిర్యాదు ఇచ్చి, అటునుంచి అటే జిల్లా ఎస్పీని కలసి ఉన్న విషం చెప్పాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులే షాకయ్యారు. అప్పటికే అతను చాలా శవాలను మాయం చేశాడు. కొంతమంది హంతకులతో తాను చేతులు కలిపానని, వారికి సాయం చేసే క్రమంలో ఆ శవాలను మాయం చేశానని చెప్పుకొచ్చాడు. 20 ఏళ్లుగా తాను ఈ పని చేస్తున్నానని, కొన్ని వందల శవాలను తాను మాయం చేశానని అంటున్నాడు. అయితే అదంతా ప్రాణ భయంతోనే చేసినట్టు చెప్పాడు ఆ వ్యక్తి. తనను బెదిరించి, తనతో ఆ తప్పులు చేయించారన్నాడు. పోలీసులు తనకు రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు చెబుతానని అన్నాడు. అపరాధ భావనతో కుమిలిపోతున్న తాను నిజాలు చెప్పేందుకే పోలీసుల ముందుకొచ్చానని వాంగ్మూలం ఇచ్చాడు.
కోర్టు అనుమతి..
అన్నీ నిజాలే చెబుతానంటూ పోలీసుల్ని ఆశ్రయించిన ఆ వ్యక్తి.. చిన్న మెలిక పెట్టడం ఇక్కడ విశేషం. పోలీసులు తనకు రక్షణ కల్పిస్తేనే తాను నిజాలు బయటపెడతానన్నాడు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అతడిపై భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 211(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పోలీసులకు అందించడంలో విఫలమైతే ఈ సెక్షన్ నమోదు చేస్తారు. కొత్త శిక్ష్మాస్మృతి ప్రకారం 211(ఏ) సెక్షన్ కింద నమోదైన తొలికేసు ఇదే కావడం విశేషం. అయితే అతడి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. అయితే ఆ వ్యక్తి ఎస్పీని కలవడం, కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు పశ్చాత్తాప పడుతున్నాడో తేలాల్సి ఉంది.
మానసిక క్షోభ..
ఒకటా రెండా, లెక్కలేనన్ని శవాలను మాయం చేసిన అతను ఇప్పుడు పశ్చత్తాపంతో కుంగిపోతున్నాడు. తన తప్పు తాను తెలుసుకున్నానని చెబుతున్నాడు. అపరాధ భావం తనను వెంటాడుతోందని, అందుకే తాను నిజాలు చెప్పేందుకు పోలీసుల వద్దకు వచ్చానంటున్నాడు. అతడు చెప్పేవి అన్నీ నిజాలేనా లేక ఏదైనా కేసుని తప్పుదోవ పట్టించేందుకు ఇలా చెబుతున్నాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.