Nellore Crime: కళాశాలలో వేధింపులు తట్టుకోలేక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం నెల్లూరులో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది హేమశ్రీ. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో పేరెంట్స్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఈ కళాశాల నుంచి తనను వేరే కాలేజీ మార్చాలని కోరింది. ఇక్కడ కళాశాల యాజమాన్యం సరిగాలేరని, వేధిస్తున్నారంటూ తెలిపింది. వీడియో కాల్ అనంతరం గంటన్నరకే అంటే ఉదయం 9.30 గంటలకు కళాశాల యాజమాన్యం.. హేమ శ్రీ పేరెంట్స్‌కు ఫోన్ చేసి పాప అస్వస్థతకు గురైందని సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు హేమశ్రీ పేరెంట్స్. అయితే అప్పటికే ఆత్మహత్యకు పాల్పడిన హేమశ్రీని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి పంపించేశారు కళాశాల యాజమాన్యం. అంతేకాదు విద్యార్థులకు సెలవులు కూడా ఇచ్చేసారు. దీంతో ఆగ్రహానికి గురైన హేమశ్రీ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇవాళే కాదు నిన్న రాత్రి కూడా హేమశ్రీ ఫోన్ చేసిందని తల్లిదండ్రులకు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తెలిపినట్లు హేమశ్రీ తల్లి తెలిపారు. ఇది విన్న కొన్ని గంటల్లోనే హేమశ్రీ ఆత్మహత్య వార్త వినాల్సి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.