Odisha murder case: మనం సాధారణంగా పిల్లల మధ్య చిన్న చిన్న తగాదాలు, అసూయలు చూస్తుంటాం. కానీ ఇవి ఒక భయానక హత్యకు దారితీస్తే? వినడానికి షాక్ కలిగించే ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. తల్లిదండ్రులు తనని పట్టించుకోవడం లేదని ఆవేదనతో, ఓ 17 ఏళ్ల అబ్బాయి తన 12 ఏళ్ల తమ్ముడినే చంపేశాడు. అంతే కాదు శవాన్ని ఇంటి దగ్గరే పాతిపెట్టి, 45 రోజుల పాటు ఎవరూ అనుమానం రాకుండా ఉండిపోయాడు. బాలంగీర్ జిల్లాలోని టిటిలాగఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… 17 ఏళ్ల పెద్ద కుమారుడు, తన తమ్ముడు పట్ల తల్లిదండ్రులు చూపుతున్న ప్రేమతో అసూయకు గురయ్యేవాడు. తనని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన అతనిలో పెరిగింది. ఆ అసూయ కోపంగా మారి దారుణంగా మారింది. దీంతో తమ్ముడిని చంపేస్తే, తనని తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారని మైండ్‌లో ఫిక్స్ అయ్యాడు. జూన్ 28 సాయంత్రం ఆ రోజు, తల్లిదండ్రులు బయట పనికి వెళ్లగా, ఇంట్లో పెద్ద కొడుకు, చిన్న కొడుకు మాత్రమే ఉన్నారు. ఒక్కసారిగా కోపంతో, ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని చిన్న తమ్ముడిపై దాడి చేసి చంపేశాడు. రక్తం కారుతుండగా, నేరం దాచిపెట్టాలనే ఉద్దేశంతో ఇంట్లోనే నేలను తవ్వి శవాన్ని పాతిపెట్టాడు. తల్లిదండ్రులు అనుమానించవచ్చన్న భయంతో మళ్లీ తన తమ్ముడి శవాన్ని తవ్వి బయటకి తీసి, ఇంటి దగ్గర మరో ప్రదేశంలో పాతిపెట్టాడు.
జూన్ 29న తల్లిదండ్రులు పోలీసులకు తమ చిన్న కుమారుడు కనిపించడంలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మొదట పోలీసులు దీన్ని బాలల అక్రమ రవాణా కేసుగా అనుమానించారు. సీసీటీవీలు పరిశీలించారు, పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. కానీ ఫలితం లేకపోయింది. 45 రోజుల పాటు ఈ కేసులో క్లూ లేకపోవడం బ్లైండ్ కేసుగానే కొనసాగింది. కానీ ఒక చిన్న క్లూ ఈ మిస్టరీని ఛేదించింది. దర్యాప్తు సమయంలో, తల్లి ఇచ్చిన ఒక సమాధానం పోలీసులకు అనుమానం తెప్పించింది. జూన్ 28 సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు, పెద్ద కొడుకు నేల కడుగుతున్నాడని ఆమె చెప్పింది. ఇది అతను సాధారణంగా చేయడు కాబట్టి, పోలీసులు అతనిపై దృష్టి సారించారు. కఠినమైన ప్రశ్నలు వేసిన తర్వాత, అతను చివరికి నేరాన్ని ఒప్పుకున్నాడు.
తర్వాత పోలీసులు శవాన్ని వెలికితీసి, కేసును సాక్ష్యాలతో నిర్ధారించారు. బాల నేరస్థుడిగా (Children In Conflict with Law – CICL) అతన్ని చట్టం ప్రకారం కస్టడీకి తీసుకున్నారు. ఈ సంఘటన మనకు చెప్పే విషయం ఏమిటంటే, పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. తల్లిదండ్రులు తెలియకపోయినా, ప్రేమలో తేడా చూపించడం కొన్నిసార్లు పిల్లల్లో ప్రమాదకరమైన భావాలను రేకెత్తించవచ్చు. అసూయ, నిర్లక్ష్యం, ప్రేమ లోపం… ఇవి ఎంతటి విపత్తుకు దారి తీస్తాయో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.