Nagpur Tragedy: నాగ్‌పూర్‌లో రోడ్డుప్రమాదంలో భార్య మృతి చెందగా, సహాయం దొరకక భర్త మోటార్‌సైకిల్ వెనుక మృతదేహాన్ని కట్టి తీసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనిషి జీవితంలో భార్యాభర్తల అనుబంధం ఎంత గాఢమో చెప్పనవసరం లేదు. సుఖంలో, దుఖంలో, కష్టంలో, సంతోషంలో ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా నిలుస్తారు. కానీ, చనిపోయిన తన జీవిత భాగస్వామిని ఒక భర్త తన బైక్ పై కట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాగలదని ఊహించగలమా? ఇదే నిజం. నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనను చూసినవారు షాక్‌కు గురతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో నాగ్‌పూర్ – జబల్పూర్ నేషనల్ హైవే మీద, మోర్‌ఫటా ప్రాంతం దగ్గర, డేవోలాపర్ పోలీస్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. సియోని జిల్లాకు చెందిన అమిత్ యాదవ్, ఆయన భార్య గ్యార్సి అమిత్ యాదవ్… గత 10 ఏళ్లుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని లోనారా అనే ఊరిలో నివసిస్తున్నారు.
ఆ రోజు వీరిద్దరూ మోటార్‌సైకిల్‌పై లోనారా నుంచి కరణ్‌పూర్ వైపు వెళ్తుండగా, వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ గ్యార్సిని ఢీ కొట్టింది. దీంతో వెనకల కూర్చున గ్యార్సి అక్కడికక్కడే మృతి చెందింది. అమిత్ తన భార్య శవం పక్కనే నిలబడి షాక్‌లో ఉండిపోయాడు. కానీ అంతకంటే బాధాకరం ఏంటంటే… రోడ్డు మీద వెళ్తున్న వారెవరూ సహాయం చేయలేదు. భార్య చనిపోయిందని సహాయం చేయండని చేతులెత్తి మొక్కిన ఎవరూ కనికరం కూడా చూపలేదు.
“దయచేసి నా భార్యు ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేయండి…” అని అమిత్ మళ్లీ మళ్లీ వేడుకున్నా ఒక్కరూ ముందుకు రాలేదు. రద్దీ రహదారిపైనే సంఘటన జరిగినా, అందరూ చూసి చూడనట్టే వెళ్లిపోయారు. చివరికి అమిత్ గుండె బరువుతోనే, తన భార్య శవాన్ని గుడ్డతో కట్టి… తన బైక్ వెనుక భాగంలో కట్టేశాడు. తన సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా వైపు బయలుదేరాడు.
కన్నీటితో బైక్ నడుపుతూ వెళ్తుండగా ఆ క్షణాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. బైక్ వెనుక కట్టిన శవాన్ని చూసి చాలా మంది అయ్యో అంటూ వీడియోలు తీశారు. మొదట ఎవరూ పట్టించుకోని వారు, ఆ తర్వాత అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఎవరో ఎదురై ప్రశ్నలు వేస్తారన్న భయంతో, అమిత్ ఆగకుండా వెళ్లిపోయాడు.
హైవే పోలీసులు కూడా ఈ వీడియోను చూసి, అక్కడే ఉండి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మొదట అతన్ని ఆగమన్నారు కానీ అమిత్ ఆగలేదు. చివరకు కొంత దూరం వెళ్లిన తర్వాతే అతన్ని ఆపగలిగారు. తర్వాత పోలీసులు గ్యార్సి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నాగ్‌పూర్‌లోని మేయో హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
ఈ సంఘటన ఒక్కటే కాదు… ఇది మన సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, మానవత్వం తగ్గిపోతున్నదానికి ప్రతీక. ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేయకపోవడం… ఒక మనిషి తన భార్య మృతదేహాన్ని ఇలా తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావడం… మనం ఎక్కడికి వెళ్తున్నామనే ప్రశ్నను మనముందుంచుతోంది.
సోషల్ మీడియాలో చాలా మంది ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సహాయం చేయడం మనిషి మానవత్వపు కనీస కర్తవ్యమైతే… అది కూడా మర్చిపోతున్నామా?” అని అడుగుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే బాధితుడికి సహాయం చేస్తే చట్టపరమైన సమస్యలు రాకుండా ‘గుడ్ సమారిటన్’ చట్టం మన దేశంలో ఉన్నా… ఇంకా ఎందుకు జనాలు భయపడుతున్నారు? మన మానవత్వం బతికి ఉండాలంటే… మనం మన కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే రేపు మనకో, మన సన్నిహితులకో ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు సహాయం చేస్తారు?