Brutal murder: ఎక్కడైనా ఇంటి ఓనర్ అద్దె డబ్బులు అడిగితే ఏం చేస్తారు. డబ్బులు ఉంటే ఇచ్చేస్తారు. లేదంటే కొంత సమయం కావాలని అడుగుతారు. అంతేకానీ, అద్దె డబ్బులు అడిగినందుకు ఏకంగా మర్డర్ చేస్తారా..? అది కూడా 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు చేశారంటే.. ఎంత దారుణం..? ఇది జరిగింది ఎక్కడో కాదు. హైదరాబాద్‌లోనే ఈ అమారవీయ ఘటన వెలుగుచూసింది.
అతి కిరాతకంగగా 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు చేసిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. కమలా దేవి అనే వృద్ధురాలు ఇంటి నంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపు తెరిచి చూడగా కమలా దేవి విగతజీవిగా పడి ఉంది. మృతదేహంపై గాయాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తు చేసి కమలా దేవి ఇంట్లో అద్దెకు ఉండే ఓ యువకుడే అమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించామని అన్నారు. వృద్ధురాలిని ఉరిపోసి హత్య చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు ఆమె మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులందరికీ షేర్ చేశాడని పోలీసులు తెలిపారు. అద్దె విషయంలో వృద్ధురాలు మందలించడంతో యువకుడు కక్ష పెంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అందుకే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పారిపోయినట్లు సమాచారం. కమలా దేవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతన్ని పట్టుకొని విచారణ జరుపుతామని వెల్లడించారు.