Fire Accident: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి షాపులో ఇద్దరు వర్కర్లు వెనక గదిలోనే నిద్రిస్తున్నారు. సుమారు 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా స్పార్క్‌లు రావడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆ వెంటనే మంటలు దుస్తులకు వ్యాపించాయి. క్షణాల్లోనే షాపు మొత్తం మంటలు వ్యాపించాయి.
మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు వర్కర్లు బయటకు పరుగెత్తి ప్రాణాలను నిలబెట్టుకున్నారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
దుస్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగదు, బిల్లింగ్ యంత్రాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. 80 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయని అంచనా.
Also Read: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీలు సేకరించి, షార్ట్ సర్క్యూట్ కారణమో లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.