ఇంట్లో అందరినీ తిట్టి రాహుల్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది రుద్రాణి. రుద్రాణి వెనకే వెళ్లి అక్కడే జరుగుతుందో తెలుసుకోమని రాజ్ చెప్పడంతో స్వప్న కూడా స్టేషన్‌కు వెళ్తుంది. రుద్రాణి వెళ్లి రాహుల్‌ను పరామర్శిస్తుంటే.. స్వప్న మాత్ర ఏడుస్తూ చూస్తుంటుంది. స్వప్నను చూసిన రాహుల్ నేను ఏ తప్పు చేయలేదు స్వప్న. నాకే పాపం తెలియదు నన్ను నమ్ము స్వప్న అంటూ రాహుల్ ఎమోషనల్ అవుతుంటే.. స్వప్న కోపంగా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. మగాణ్ని అనే మత్తులో మనిషిని అనే విషయం కూడా మర్చిపోయావు. కట్టుకున్నది చెప్పే మంచిని కూడా వదిలేసి అబద్దాలతో ఆకలి తీర్చుకునే మీ అమ్మ మాటలే నమ్మావు.. మీ అమ్మ మాట మీదే నడుస్తూ.. అబద్దం మీదే తడుస్తూ.. అదే ఆనందం అని నువ్వు బతికావు. ఇప్పుడు ఏమైంది. జైళ్లో కూర్చుని చిప్ప కూడు తినాల్సి వచ్చింది అంటూ తిడుతుంటే..
రుద్రాణి కోపంగా స్వప్న నువ్వు ఇక్కడకు వచ్చింది నువ్వు వాణ్ని ఓదార్చడానికా..? లేక తిట్టడానికా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో స్వప్న కోపంగా నువ్వు ఉన్నంత కాలం నీ కొడుకు నీ మాట విన్నంత కాలం ఒకరు అవమానించాల్సిన పని లేదు. నీ కొడుకే అవమానాన్ని వెతుక్కుంటూ అగాథంలో పడిపోతాడు. దానికి నిదర్శనమే ఈ జైలు గోడలు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు అంటూ ఏడుస్తుంది స్వప్న. దీంతో రాహుల్ కూడా ఎమోషనల్ అవుతూ.. నువ్వు చెప్పింది అక్షర సత్యం స్వప్న. నేను ఎన్నో తప్పులు చేశాను. నిన్ను ఎంతగానో బాధపెట్టాను. కానీ నేను హత్య చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు స్వప్న అంటాడు. ఎలా నమ్మమంటావు.. తాళి కట్టిన భార్యతోనే నేను పలానా దాన్ని ప్రేమించాను. దానితోనే డబ్బుందని.. ఇక దాంతోనే ఉంటాను.. దాని ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన గొప్ప మనిషివి నువ్వు అంటుంది.
దీంతో రాహుల్ అలా అనకు స్వప్న నేను నీకు చెప్పింది నిజమే తన దగ్గర డబ్బు ఉందని ఆ డబ్బు నాకు సొంతం కావాలని వెళ్లింది కూడా నిజమే కానీ నేను ఏమీ ఆ అమ్మాయిని ఇష్ట పడలేదు స్వప్న నాకు ఆ ఆలోచన కూడా లేదు. అలాంటిది తనని చంపాలని నేను ఎందుకు అనుకుంటాను దాని వల్ల నాశనం అయ్యేది నా జీవితమే కదా ఒక్కసారి ఆలోచించు. స్వప్న ఇంట్లో మామయ్యలకు రాజ్ కు చెప్పి ఎలాగైనా నన్ను కాపాడు స్వప్న.. ఫ్లీజ్ నీకు దండం పెడతాను స్వప్న.. అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే.. ఇన్నాళ్లు నేను నమ్మితేనే కదా మోసం చేశావు.. అయినా జీవితం పంచుకున్న దాన్ని కదా..? మళ్లీ నిన్ను నమ్మి ఏదైనా ప్రయత్నం చేయాలన్నా అబద్దానికి చిరునామా లాంటి అయిన నిన్ను ఇక్కడ, అక్కడ ఎవ్వరూ నమ్మరు అంటూ తిడుతుంటే..
రుద్రాణి కోపంగా నువ్వేం చేయోద్దు నోరు మూసుకుని ఉండు.. ఓరేయ్ రాహుల్ నువ్వు దేనికీ తల వంచోద్దురా..? ఎవ్వరికీ భయపడనక్కర్లేదు.. నీకు నేనున్నాను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నిన్ను నేను బయటికి తీసుకొస్తాను.. అని చెప్తుంటే.. చూశావా ఇది మీ అమ్మ మానసిక స్థితి.. ఇక మీరు మారరు.. జీవితాలు నాశనం అయినా..? బతుకులు బూడిద అయినా మీరు మాత్రం మారరు. ఇప్పుడు అది కూడా చాలదు అన్నట్టు కొడుకును తప్పుడు మార్గంలో విడిపించాలని చూస్తున్నారు అని స్వప్న చెప్పగానే.. రుద్రాణి కోపంగా నేను తప్పుకుంటే.. వాడు జైళ్లో ఉండటం కాదు నువ్వు కూడా రోడ్డు మీద ఉంటావు.. భర్త లేని ఆడదానిగా బజారున పడతావు.. అందుకే నేను కొడుకును అడ్డదారిలో వెళ్లైనా సరే కాపాడుకోవాలి అనుకుంటున్నాను.. నీకు చేతనైతే రహదారిలో వెళ్లి కాపాడుకో అని చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది.
రాజ్, కావ్య కూయిలీ ఉన్న ఇంటికి వెళ్తారు అక్కడ సెక్యూరిటీ ఉండటంతో దొంగచాటుగా లోపలికి వెళ్లి సీసీటీవీ పుటేజీ తీసుకుని స్టేషన్‌కు వెళ్తారు. మరోవైపు రుద్రాణి, రంజిత్ దగ్గరకు వెళ్తుంది. రంజిత్ బేరాలు ఆడుతుంటే.. అక్కడికి రాజ్, కావ్య వెళ్లి రంజిత్ ను బెదిరిస్తారు. రంజిత్‌ను స్టేషన్ లోకి తీసుకెల్లి ఎస్సైకి సీసీటీవీ పుటేజీ చూపిస్తారు. దీంతో పోలీసులు రంజిత్‌ను అరెస్ట్ చేసి రాహుల్ ను వదిలేస్తారు.
తర్వాత అందరూ ఇంటి వస్తారు. ఇంట్లో వాళ్లందరూ రాహుల్, రుద్రాణిని తిడతారు. దీంతో రాహుల్ ఏడుస్తూ.. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని.. తనను క్షమించమని అడుగుతాడు. దీంతో కావ్య క్షమించాల్సింది మేము కాదు రాహుల్ మా అక్క అని చెప్పగానే.. రాహుల్ స్వప్న వైపు చూస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.