Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆయన కుమారులు.. గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అయితే 7 గంటల 20 నిమిషాలకు ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 7 గంటల 25 నిమిషాలకు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. నేడు కార్తీక సోమవారం రోజు లాగే ఉదయాన్నే లేచారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలడంతో వారి కుటుంబ సభ్యులు ఈ మరణ వార్తను తీసుకోలేక పోతున్నారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత ఐదు నిమిషాల్లోనే కన్నుమూశారు.
అందెశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ మరణం.. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో.. జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేసుకున్నారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అందెశ్రీ తనకు అత్యంత ఆప్తుడంటూ గుర్తుచేసుకున్నారు. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మృతి యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో వారి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్
అలాగే ప్రముఖ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, పార్టీల ముఖ్య నేతలు, సాహితీ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.