Maharastra News : సరదాగా స్నేహితులంతా కలిసి అడవిలోకి వేటకు వెళ్లారు. రహస్యంగా అంతా ఒక్కొక్కరు ఒక్కో చోట దాక్కుని వేటాడేందుకు వేచి చూస్తున్నారు. ఇంతలో సడెన్ గా అలికిడి వినిపించడంతో.. అంతా అప్రమత్తమయ్యారు. అడవి పంది తమ ఉచ్చులోకి వచ్చింది అనుకుని బృందంలోని ఓ వ్యక్తి తుపాకీ పేల్చాడు. అంతే.. ఆ తర్వాత ఓ పొలికేక వినిపించింది. ఓ వ్యక్తి పెద్దగా అరుస్తూ.. తూటా గాయంతో విలవిల్లాడాడు. అంతా.. అక్కడికి చేరుకున్నాక అసలు విషయం తెలిసింది. అడవి పంది అనుకుని కాల్చింది తమ స్నేహితుడినే అని.. దాంతో కంగారు పడిపోయిన వాళ్లంతా ఆ శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక అడవికి 12 మంది వ్యక్తుల బృందం వేటకు వెళ్లింది. అందులో ఒకరు తమ స్నేహితుడిని, అడవి పంది అనుకుని పొరబడి కాల్చులు జరపడంతో.. అతను చనిపోయాడు. బాధితుడి భార్య.. తన భర్త కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఈ విషయం రహస్యంగానే ఉండిపోయింది. ఆ తర్వాత కానీ.. అసలు విషయాలు వెలుగులోకి రాలేదు. ఈ ఘటనలో నిందితులుగా గుర్తిస్తు.. పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పాల్ఘర్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.
షాహాపూర్ తాలూకాలోని బోర్శెటి గ్రామంలోని ఆదివాసీ కుటుంబాలకు చెందిన బృందం.. జనవరి 28 సాయంత్రం అడవి పందులను వేటాడేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం మరో స్నేహితుడు రమేష్.. వారితో వేటకు కలిసి వెళ్లాడు. అప్పుడే.. వారు క్యాంప్ ఏర్పాటు చేసిన చోట.. స్నేహితులంతా కలిసి అడవి పందుల కోసం వెతుకుతున్నారు. అక్కడే దగ్గర్లో.. పొదల నుంచి శబ్దం రావడంతో.. అడవి పంది అని భావించి. కాల్పులు జరిపారు. ఆ ఘటనలో వర్త అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
జరిగిన పొరబాటును గుర్తించిన బృందం.. తీవ్ర భయాందోళనకు గురయ్యింది. అతని మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలని భావించి, దగ్గర్లోని ఓ చెట్టు వెనుక పూడ్చిపెట్టారు. ఈ ప్రమాదం గురించి ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకుని అక్కడి నుంచి గ్రామానికి చేరుకున్నారు. దాంతో.. తొలి రెండు, మూడు రోజులు.. వర్త కుటుంబానికి ఎలాంటి అనుమానం రాలేదు. అతను ఇంకా అడవిలోనే ఉన్నాడని అనుకున్నారు. కానీ.. ఎంత ఎదురుచూసినా.. తిరిగి రాకపోవడంతో వర్త భార్య అమిత స్థానిక మనోర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఫిర్యాదులోనే తన భర్త.. అతని స్నేహితులతో కలిసి వేటకు వెళ్లాడని, అప్పటి నుంచి తిరిగి రాలేదని తెలిపింది.
Also read : కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే
దాంతో.. విచారణ చేపట్టిన పోలీసులు.. వర్త స్నేహితులను విచారించి ఈ ప్రమాదం గురించి ప్రశ్నించారు. తొలుత అంతా అబద్దం చేప్పినా.. విచారణలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందించడంతో.. మరింత లోతుగా ప్రశ్నించారు. అప్పుడే.. అసలు విషయం తెలిసింది. అడవిలో వర్తతో ఉన్న సాగర్ హదల్ అనే స్నేహితుడు.. తన దేశీయ రైఫిల్‌తో వర్త వైపు కాల్చాడని, ఆ కాల్పుల్లో అతను మరణించినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నేరపూరిత నరహత్య అభియోగంపై 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మాత్రమే మరణించాడని పాటిల్ స్పష్టం చేశారు.