Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. హోరాహోరీ ప్రచారం.. గెలుపు మాదంటే మాది.. ఒకరు అభివృద్ధి పేరు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంటే.. మరొకరు సానుభూతి పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక అధికార పార్టీ కాంగ్రెస్ కు, ప్రధాన ప్రతపక్షం బీఆర్ఎస్ కు అత్యంత కీలక మైనది. అటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం నిర్వహిస్తుంది. ఈ ఎన్నిక ఫలితం మూడు పార్టీలకూ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ విశ్లేషకుల్లో కొత్త చర్చకు దారి తీసింది.
⦿ గెలిసి తీరాల్సిందే..?
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం.. పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎలాగైనా గెలిసి తీరాలని కాంగ్రెస్ హోరాహరీగా ప్రచార సభలు నిర్వహిస్తోంది. తాము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలే విజయాన్ని అందిస్తాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తమ ఉనికిని.. సత్తాను చాటుకోవడానికి ఈ విజయం అనివార్యంగా మారింది. బీఆర్ఎస్ సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై పూర్తిగా ఆధారపడుతోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి కూడా ఈ ఉపఎన్నికలో గెలుపు అనివార్యంగా మారింది. బీజేపీ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ కరిష్మాపైనే ఆధారపడి ప్రచారం చేస్తోంది. ఈ లక్ష్య సాధన కోసం మూడు పార్టీలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి.
⦿ గుర్తులపై బీఆర్ఎస్ అభ్యంతరాలు..
అయితే.. ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శల దూకుడు పెంచింది. అదే సమయంలో ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులు.. ముఖ్యంగా చపాతీ రోలర్, సబ్బు డిష్, కెమెరా, రోడ్ రోలర్, షిప్ లు.. తమ పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘కారు’ గుర్తును పోలి ఉన్నాయని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ గుర్తుల మధ్య పోలిక కారణంగా ఓటర్లు తీవ్ర అయోమయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వాదిస్తోంది. కారు గుర్తుకు వేయాల్సిన ఓటును పొరపాటున పైన చెప్పిన వాటిలో దేనికో ఒక దానికి వేసే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.
⦿ ఇది ఓటమి భయానికి సంకేతమా?
బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న ఈ ఆందోళన ఆ పార్టీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లో గుర్తుతో పాటు అభ్యర్థి పేరు, ఫొటో కూడా స్పష్టంగా ముద్రించి ఉంటాయి.. కాబట్టి, ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఇలా ఈవీఎంలో గుర్తుల అయోమయం అంటూ అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆ రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. పోలింగ్‌కు ముందే ఓటమికి సాకులు వెతుక్కునే ధోరణిలో బీఆర్ఎస్ ఉందని ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న ఈ గుర్తుల ఆందోళన ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం మైనార్టీ ఓట్ల దారెటు..?