Khammam Tragedy: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టూత్ పేస్ట్ అనుకుని.. ఎలుకల మందు తిని మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా గోవింద్ తండాకు చెందిన మూడేళ్ల చిన్నారి.. ఇంట్లో ఆడుకుంటూ టేబుల్ పై ఉన్న ఎలుక మందును టూత్ పేస్ట్ అనుకుని తినింది. కొంత సేపటికి చిన్నారికి వాంతులు, తలనొప్పి అస్వస్థకు గురైంది. గమనించిన తల్లి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉందని హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎలుకల మందు వంటి ప్రమాదకర రసాయనాలు పిల్లలకు కనిపించకుండా, అందని చోట ఉంచాలని హెచ్చరిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అవగాహన లేక సాధారణ వస్తువుల్లా ఎక్కడబడితే అక్కడ ఉంచుతారు. కానీ అవి పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని తెలిపారు.
Also Read: ప్రాణం తీసిన కిటికీ వివాదం.. సూసైడ్ నోట్ రాసి మరి..!
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా.. గ్రామస్థులు పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.