Bandi Sanjay: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాజాగా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇంటికి పిలిచి అవమానిస్తున్నారని మండిపడ్డారు.
సోమవారం కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా అధికారులపై కాంగ్రెస్ మంత్రులు అవమానించడం ఏ స్థాయిలో దారుణమో.. సీఎం రేవంత్ రెడ్డి గ్రహించాలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపించి, ఆ మంత్రులను బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు.
రౌడీషీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తుంటే పట్టింపు లేదా? అంటూ ప్రశ్నించారు. రౌడీషీటర్లు బహిరంగంగా పోలీసులపై హత్యాయత్నం చేస్తున్నారు, గోరక్షకులపై కాల్పులు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మౌనంగా చూస్తోంది. తప్పు చేసిన రౌడీషీటర్లకు ఎంఐఎం అండగా ఉంటే వారికే వత్తాసు పలుకుతున్నారు అని ఫైర్ అయ్యారు.
ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం నేతల కాళ్లు పట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాష్ట్రంలో నేరస్తులకు, రౌడీలకు మద్దతు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నాయి అని సంజయ్ వ్యాఖ్యానించారు.
మహిళలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు బండి సంజయ్. నెలకు రూ.2500లు ఇస్తామని, ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ అవేవీ అమలు చేయలేదని నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రౌడీషీటర్లు బయటకు రావాలంటేనే గజగజ వణికేలా చేయాలన్నారు.
Also Read: ఈవీఎంలో గుర్తులపై అభ్యంతరాలు.. బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా..?
మరోవైపు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. జరగబోయే 150 “ఐక్యతా మార్చ్” కార్యక్రమాలను విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సర్దార్ పటేల్ చరిత్ర తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.