జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ప్రచారానికి వస్తారనే ఆశ కేడర్ లో ఉంది, అందులోనూ ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో కూడా ఉంది. కానీ ఆయన రాలేదు. చివరి వరకూ వస్తారు వస్తారు అని ఊరించిన పార్టీ నేతలు చివరకు ఉస్సూరుమనిపించారు. ఆ లోటు లేకుండా చేసేందుకు చివరాఖరిగా కేసీఆర్ ని తెరపైకి తెచ్చారు. మైకులు మూగబోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఫొటోలతో పోస్టర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేసీఆర్ ని ఇలా తెరపైకి తెచ్చి మమ అనిపించారు బీఆర్ఎస్ నేతలు.
ఎగవేతలను… మోసాలను ఇంకెన్నాళ్లు భరిద్దాం
మోకా దొరికింది… ధోకా చేసిన వాళ్లకు బుద్ధి చెబుదాం
రెండేండ్ల బాకీలన్నీ వసూలు చేద్దాం…
కారు గుర్తుకు ఓటేద్దాం 🚘
తెలంగాణను కాపాడుకుందాం ✊#VoteForCar pic.twitter.com/pwBF00YByG— BRS Party (@BRSparty) November 10, 2025
మోకా దొరికింది..
మోకా దొరికింది, ధోకా చేసిన వారికి బుద్ధి చెబుతామంటూ కేసీఆర్ పేరిట ఓ పోస్టర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఆగిపోయిందని, పథకాలన్నీ ఆగిపోయాయని అందులో ప్రస్తావించారు. కేసీఆర్ వస్తారని ఎదురు చూస్తే చివరకు ఆయన ఫొటోతో పోస్టర్లు వేసి బీఆర్ఎస్ నేతలు సరిపెట్టుకోమన్నట్టు దీన్ని చూస్తే అర్థమవుతుంది.
కటౌట్ సరిపోతుందా?
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. కానీ నేరుగా ఆ నాయకుడే వచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడిగితే ప్రజలు ఒకటికి రెండుసార్లు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వద్దు పొమ్మన్నారు, లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీకి సున్నా చుట్టారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ సాధించేదేంటి? చేతిలో ఉన్న ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేతో ఏం సాధిస్తుంది. దీనికి బీఆర్ఎస్ నుంచి విచిత్రమైన సమాధానాలొస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం పీఠం కదిలిపోతుందట, కాంగ్రెస్ అధినాయకత్వం దిగొస్తుందట, రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకీ వారు చెబుతున్న మాటలకి ఎక్కడైనా పొంతన ఉందా? కచ్చితంగా లేదని అంటున్నారు నెటిజన్లు.
Also Read: నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి
2023లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినా, సిట్టింగ్ సీటు నిలబెట్టుకున్నట్టు అవుతుంది కానీ, పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. వాస్తవం చెప్పుకోవాలంటే ఆ సీటు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ లాక్కున్నదే. 2014 ఎన్నికల్లో టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన మాగంటి గోపీనాథ్ స్థానిక పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ లో చేరి ఆ తర్వాత మరో రెండుసార్లు కారు గుర్తుపై గెలిచారు. అంతమాత్రాన జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కి పట్టు ఉందనుకుంటే ఎలా? అది కచ్చితంగా మాగంటి కేడర్ బలమే. కానీ ఆయన మరణం తర్వాత ఆ కేడర్ లో చీలిక వచ్చింది. కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే పరిస్థితి నెలకొంది. ఈ దశలో బీఆర్ఎస్ కి ఓటమి ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో కేసీఆర్ ప్రచారానికి కూడా మొహం చాటేశారనే వాదన వినపడుతోంది. దాన్ని కవర్ చేసుకోడానికి పార్టీ తంటాలు పడుతోంది.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్..