Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హైదరాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని.. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ BIG TV తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈసారి ఎన్నికల కోసం సుమారు 3,000 మంది సిబ్బందిను నియమించినట్లు కర్ణన్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వడం ద్వారా వారు ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
డబుల్ ఓటర్స్ ఉన్న వారిపై డబల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతి ఇస్తామని కర్ణన్ తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 27 కేసులు నమోదు చేశామని ఎన్నికల అధికారి తెలిపారు. పార్టీలు కానీ, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో భద్రత, పర్యవేక్షణ పరంగా 139 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సున్నితమైన పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసి, ఏవైనా అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్ వ్యవస్థ, ఫ్లయింగ్ స్క్వాడ్, విజిలెన్స్ టీంలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సరిపడా EVMలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు 4 బ్యాలెట్ యూనిట్లును సిద్ధంగా ఉంచారని తెలిపారు. రేపు అన్ని EVMలను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తామని చెప్పారు. మాక్ పోలింగ్ ఉదయం నిర్వహించి, ఉదయం 7 గంటలకు అధికారికంగా పోలింగ్ ప్రారంభమవుతుంది అని వివరించారు.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?
ఈసారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఓటర్లకు లంచాల వంటి వ్యవహారాలు డిజిటల్ మార్గాల ద్వారా జరుగకుండా గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లను కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కర్ణన్ వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ప్రలోభాలు ఇవ్వడం, తప్పుడు ప్రచారం చేయడం లాంటివి గమనిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.