Mysuru Cylinder Blast: మైసూరు అంబా ప్యాలెస్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో మైసూర్ ప్యాలెస్‌లోని జయమార్తాండ గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్యాలెస్ సమీపంలో బెలూన్లను నింపడానికి గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది.
మైసూరు ప్యాలెస్ సమీపంలో పేలుడు
క్రిస్మస్ సెలవుల కారణంగా పుష్పాల ప్రదర్శన, సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాటిని చూసేందుకు పర్యాటకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో బెలూన్ అమ్మకందారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో నలుగురు పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు మహిళ కూడా ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతుడి పేరు సలీంగా గుర్తించారు. అతడి వయస్సు 40 ఏళ్లు. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన లక్ష్మిగా ఒకన్ని గుర్తించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఒకరు మృతి
గాయపడిన వారిలో నంజన్‌గూడ్‌కు చెందిన మంజుల, రాణేబెన్నూర్‌కు చెందిన కొట్రేష్, కోల్‌కతాకు చెందిన షాలినా షబ్బీర్ ఉన్నారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది. ఘటన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు.
కొట్రేష్ కెఎస్‌ఆర్‌టిసి హవేరి డివిజన్ ఉద్యోగి. గురువారం తన భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో సెలవుల కోసం మైసూరుకు వచ్చాడు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ తెలిపారు.
ALSO READ: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు