Jagtial Accident: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో ఈరోజు ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వాల్గొండ గ్రామం నుండి మల్లాపూర్ వైపు విద్యార్థులతో వెళ్తున్న ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. నిత్యం పాఠశాలలకు వెళ్లే చిన్నారులతో కిక్కిరిసి ఉన్న ఆ ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఆ ప్రాంతమంతా విద్యార్థుల ఆర్తనాదాలతో భయానక వాతావరణం నెలకొంది.
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను హుటాహుటిన మల్లాపూర్, మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటో సామర్థ్యానికి మించి చిన్నారులను కూర్చోబెట్టడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నిజామాబాద్‌లో దారుణం.. చెవి నొప్పితో హస్పిటల్‌కి వస్తే శవంగా పంపించారు
ఈ ఘటనతో వాల్గొండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ పిల్లలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ తల్లిదండ్రులు ఆసుపత్రుల వద్ద ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. పాఠశాల వాహనాలపై అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని విద్యావేత్తలు, స్థానికులు వాపోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.