shocking incident : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎవరి జీవితంలో అయినా.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంత మేరకు ప్రభావితం చూపిస్తాయనే విషయాన్ని కళ్లకు కట్టింది. ఒక్కరి తప్పుడు నిర్ణయం కారణంగా ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. ఆ గ్రామంతో పాటుగా, ఆ వార్త తెలిసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్యహత్య చేసుకోగా.. వారిని చూడలేక వాళ్ల ఇంటి పెద్ద ఏకంగా ఆత్మహుతి చేసుకుని ప్రాణాలు విడిచిన ఘటన సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రామంలో ఈ ముగ్గురు మరణాల దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య వివాదం కారణంగా.. ఆవేశానికి గురైన అభయ్ రాజ్ అనే వ్యక్తి.. అతని భార్య సవితా యాదవ్ కు ఉరి బిగించి చంపేశాడు. తన భార్యను చంపేసిన తర్వాత.. అభయ్ కూడా ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తల మరణాలతో వాళ్ల ఇళ్లే కాదు.. ఆ ప్రాంతమంతా విషాధ ఛాయలు అలుముకున్నాయి.
అక్కడ ఏర్పడిన విషాయాన్ని తగ్గించేందుకు ఎవరి తరం కావడం లేదు. ఎలాగోలా.. వారి మృతదేహాల్ని స్మశానాని తరలించి.. అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. బంధువులు, స్థానికుల కన్నీళ్ల మధ్య వారికి అంతిమ సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చూస్తుండగానే.. అభయ్ చితికి నిప్పంటించారు. అంతే.. అప్పటి వరుకు పక్కనే ఉన్న అతని తాత.. రామావతార్ తన మనుమడు లేని బాధను తట్టుకోలేక అదే చితిలో దూకేశాడు.
మనుమడి చితిమంటల్లో దూకి తాత ఆత్మార్పణం చేసుకోవడంతో.. అంతా అవాక్కయ్యారు. చేసేందేమి లేక పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి.. చితిలోని రెండు శవాల్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు మాత్రం ఎవరికీ అంతు బట్టడం లేదు. ఇదే విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం తెలియలేదని, కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.