Madhya Pradesh fort : గుప్త నిధుల కోసం ఎన్నో ఆలయాలు, కోటల్ని రహస్యంగా తవ్వేసిన ఘటనలు అనేకం చూశాం.. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని ఓ కోటలో ఇటీవల కాలంలో కనిపిస్తోంది. రాత్రయితే చాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా వస్తున్న ప్రజలు.. కోటలో గుప్త నిధులు, బంగారు, వెండి నాణేల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఎవరికి వారే.. జల్లెడలు, గునపాలు, మెటల్ డిటెక్టర్లను వాడుతూ.. బంగారం కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఇందులో కొంత మందికి బంగారం దొరికింది అంటూ ఆ నోట ఈ నోట ప్రచారం ఊపందుకోవడంతో.. రోజురోజుకు రాత్రి వేళల్లో ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అయితే.. ఈ వెతుకులాటకు ఛావా సినిమా కూడా కారణం కావడమే విచిత్రం.
ఇటీవల విడుదలైన ఛావా సినిమా సూపర్ ఉత్తరాధితో పాటు దక్షిణ భారతంలోనూ సంచలనం సృష్టించింది. మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు వీరుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించడంతో.. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇందులోనే.. శంభాజీ కాలంలో ఆయన ఆధీనంలోని మధ్యప్రదేశ్ బుర్హన్ పూర్ లోని అసిర్ గఢ్ కోట ప్రస్తావన ఉంది. అప్పట్లో ఈ కోటను మిలిటరీ క్యాంపుగా ఉపయోగించినట్లుగా చూపించారు. వాస్తవంలోనూ.. ఈ కోట అప్పటి శంభాజీ మహారాజ్ కు సైనిక బలాన్ని అందించింది. అలాంటి చోట్ల గుప్త నిధులు, సిరి సంపదలు ఉంటాయనే ఊహాగానాల మధ్య.. కోటలో తవ్వకాలు పెరిగిపోతున్నాయి.
మట్టిలో నాణేలో కారణం
ఈ కోటకు దగ్గర్లోనే జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం కోటకు సమీపంలో అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఆ మట్టిని సమీపంలోని ఓ పొలంలో గుట్టగా పోశారు. ఆ పొలంలో పనులకు వచ్చిన కొందరు కూలీలకు కొన్ని నాణేలు దొరికాయి. వాటిని పరిశీలించిన కొందరు.. అవి మొగలుల కాలం నాటి బంగారు నాణేలు అని ప్రచారం చేశారు. దాంతో.. కోటలో ఇంకా బంగారు నాణేలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. దాంతో.. చుట్టు పక్కల గ్రామస్థులు పెద్ద ఎత్తున ఈ కోట దగ్గరకు చేరుకుని నిధుల వేట కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే అనేక మంది బంగారం దొరికింది, వెంటి నాణేన్ని కనుక్కున్నా అనే ప్రచారాలతో.. ఈ తవ్వకాలు మరింత భారీగా పెరిగిపోయాయి.
ఇక్కడ ఇంత జరుగతున్నా.. ప్రభుత్వ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడమే విచిత్రంగా ఉంది. ఈ తవ్వకాలపై కొందరు స్థానికులు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. నిధుల లభ్యం విషయాల్ని పక్కన పెడితే.. అత్యాశకు పోయి కోటను నాశనం చేస్తున్నారు అంటూ చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్లు, స్థానిక గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం వల్ల.. చారిత్రక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోట గోడలు.. ఎందుకూ పనికి రాకుండా పోతాయని అంటున్నారు.
Also Read : Upendra Dwivedi : భారత్ పై పాక్-చైనా కుట్రలు – జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఇతర రాజ్యాల నుంచి వచ్చే దండయాత్రల కారణంగా అప్పటి రాజులు బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టే అవకాశం ఉందంటున్న చరిత్రకారులు.. అలా ఎవరైనా ఒకరికి, ఇద్దరికి నాణేలు లభించే అవకాశం ఉందంటున్నారు. అలాగని… అశాస్త్రీయంగా తవ్వకాలు చేపడితే.. అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.