Arattai App: అమెరికా సుంకాల పెంపు నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులు, సాంకేతికతపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ భారత మార్కెట్ ను ఆక్రమించాయి. ముఖ్యంగా వాట్సాప్ భారత్ లోని ప్రతి సగటు ఫోన్ లో కనిపిస్తుంది. ప్రధాని మోదీ పిలుపుతో స్వదేశీ యాప్ లపై ప్రజలు దృష్టి పెడుతున్నారు.
భారత్ లో వాట్సాప్ మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి ఓ దేశీయ యాప్ ప్రయత్నిస్తోంది. జోహో సంస్థ నుంచి వచ్చిన ‘అరట్టై’ మెసేజింగ్ యాప్ కేవలం 3 రోజుల్లోనే రోజువారీ సైన్అప్‌లను 3,000 నుండి 350,000 వరకు నమోదు చేసింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ‘అరట్టై’ మెసేజింగ్ యాప్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో ఈ యాప్ వైరల్ అయ్యింది. చెన్నైకి జోహో కార్పొరేషన్ చీఫ్ శ్రీధర్ వెంబు మాట్లాడుతూ.. నవంబర్‌లో అప్డేట్స్ తో అరట్టై యాప్ రీలాంచ్ కు ప్లాన్ చేశామన్నారు. అయితే ఇంతలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ డౌన్ లోడ్స్ అయ్యాయన్నారు.
ప్రస్తుతం ట్రాఫిక్‌లో పెరుగుదలను అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలను జోడిస్తున్నామన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి కోడ్‌ను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. రోజువారీ సైన్ అప్‌లు 3000 నుండి 3,50,000కి పెరగడంతో మూడు రోజుల్లో అరట్టై ట్రాఫిక్‌లో భారీ పెరుగుదల నమోదైందని వెంబు చెప్పారు. అరట్టై అప్డేట్ కోసం తాము ఇంకా చాలా ప్లాన్ చేశామన్నారు.
తమిళంలో అరట్టై అంటే మాట్లాడుకోవడం అని అర్థం. రోజువారీ కమ్యూనికేషన్ కోసం వినియోగించే వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్ అరట్టై. జోహో ప్రారంభించిన అరట్టై ద్వారా మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పంపుకోవచ్చు. అలాగే వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు.
స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఓ పోస్టు పెట్టారు. వాట్సాప్ తరహాలో పనిచేసే అరట్టైను వినియోగించాలని కోరారు. అరట్టై మెసేజింగ్ యాప్ చాలా సురక్షితమైనదన్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ భారతదేశంలో తయారు చేసిన యాప్‌లకు మారాలని ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో సభలో ప్రసంగిస్తూ.. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కంటే జోహో షో ఉపయోగించి ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ చేశారు. కేబినెట్ బ్రీఫింగ్‌లో జోహో ప్రొడక్ట్స్ ను ప్రస్తావించారు.
Also Read: Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి
అరట్టై యాప్ 2021లోనే విడుదలైంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునివ్వడంతో ఒక్కసారి ఈ యాప్ డౌన్ లోడ్స్ పెరిగాయి. ఈ యాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం మూడు రోజుల్లో యూజర్ల సంఖ్య 100 శాతం గ్రోత్ సాధించింది.