Shocking News West godavari: కొత్తగా ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఆనందంలో ఇంటిల్లిపాది ఉన్నారు. వారు ఎలక్ట్రికల్ సామాన్ల కొరకు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఆ పార్శిల్ రానే వచ్చింది. ఇక ఇంటి పనులు చకచకా సాగిపోతాయని ఆనందంతో ఉన్నారు వారంతా. బాక్స్ ఓపెన్.. ఆ తర్వాత జరిగిందిదే!
పశ్చిమగోదావరిజిల్లా ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళ కొత్తగా ఇంటి నిర్మాణం సాగిస్తోంది. నిర్మాణపు పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ వస్తువులను బుక్ చేశారు. ఆ వస్తువులు గల బాక్స్ ఇంటికి చేరింది. బాక్స్ ఇంటికి రావడంతో ఒక రకమైన వాసన వెదజల్లిందట. సరే ఎలక్ట్రానిక్ వస్తువులు కదా, ఆ మాత్రం ఉంటుంది వాసన అనుకున్నారు. కాసేపు ఆగి పార్సిల్ ను వారు ఓపెన్ చేశారు. ఒక్కసారిగా అందరి కాళ్ళు, చేతులు గజగజ వణికిపోయాయి.
ఆ బాక్స్ లో వచ్చింది ఎలక్ట్రానిక్ వస్తువులు కాదు, ఏకంగా మృతదేహమే వచ్చింది. స్థానికులకు విషయాన్ని తెలిపి, చివరగా పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా నివ్వెర పోయారట. ఎలక్ట్రానిక్ వస్తువుల బదులు, మృతదేహం రావడం ఏమిటని పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అసలు ఈ పార్శిల్ తెచ్చిందవరనే కోణంలో కూడా పోలీసులు వివరాలు ఆరాతీస్తున్నారు.
ఇక్కడే అసలు ట్విస్ట్..
పార్శిల్ లో డెడ్ బాడీ రావడంతో షాకైన పోలీసులు, దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అసలు పార్శిల్ బాక్స్ వచ్చిన అడ్రస్ చూస్తే, వారికి మరో షాక్ తగిలింది. తులసి తండ్రి రంగరాజు పేరిట పార్శిల్ రాగా, తులసికి ఆ పార్శిల్ చేరింది. అలాగే పార్శిల్ లో ఓ లెటర్ కూడా ఉండడం విశేషం. ఆ లెటర్ లో ఒక కోటి 30 లక్షలు డిమాండ్ చేస్తూ, డెడ్ బాడీ గురించి పోలీసులకి చెబితే ఇబ్బందులు పడతారంటూ కూడా హెచ్చరించారు. ఈ లెటర్ ను నిశితంగా పరిశీలించిన పోలీసులు, కేసు మిస్టరీ ఛేదించేందుకు సిద్దమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్.. ఆ సమస్యకు చెక్..
అసలు పార్శిల్ ఎక్కడ నుండి వచ్చింది? పార్శిల్ పంపిందెవరు? మృతదేహం ఎవరిది? కారకులెవరు? ఈ ఘటన వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. మొత్తం మీద శుభామా అంటూ ఇంటి నిర్మాణం సాగిస్తున్న వేళ, పార్శిల్ లో డెడ్ బాడీ రావడంతో ఆ ఇంటి కుటుంబసభ్యులు మాత్రం నివ్వెరపోయారు. ఈ ఘటన దావానంలా వ్యాపించడంతో, స్థానిక ప్రజలు ఇదే విషయంపై చర్చోపచర్చలు సాగించారు.