Free Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం లేక కాలేజీల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం(డ్రాపౌట్స్) తగ్గించడం, వారిలో పోషకాహార లోపాన్ని నివారించి అటెండెన్స్ శాతం పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా సర్కార్ చెబుతోంది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది. ఈనెల 15 నుంచి దీన్ని అమలు చేయనున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న ఈ బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ స్కీమ్ ను విడుతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరంభంలో పూర్తిస్థాయి విద్యార్థులు వస్తారా? లేదా? అనే అంశంపై విడతల వారీగా అమలు చేయాలని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా కొద్దీ పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిల్లో కలిపి 1,302 విద్యాసంస్థల్లోని 1,44,610 మంది విద్యార్థులకు ఈ పౌష్టికాహారాన్ని తొలి విడుతలో భాగంగా అందించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
A;slso read: మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా
ప్రభుత్వ నివేదిక ప్రకారంపాఠశాల విద్యా విభాగంలో మొత్తం 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 1302 విద్యాసంస్థలు ఉన్నాయి. కాగా పాఠశాల విద్యా విభాగంలో మొత్తం 1,269 పాఠశాలలకు చెందిన 1,30,185 మంది విద్యార్థులకు ఉదయపు అల్పాహారం, పాలు లేదా రాగిజావ అందించనున్నారు. ఇందులో హెచ్‌కేఎమ్ సంస్థ హనుమకొండ, నారాయణపేట, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని 1,162 పాఠశాలలకు చెందిన 1,03,891 మంది విద్యార్థులకు ఈ సేవలు అందిస్తోంది. అలాగే, మన ట్రస్ట్ సంస్థ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 107 పాఠశాలల్లో 26,294 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సమకూరుస్తోంది.
మరోవైపు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ విభాగంలో మొత్తం 33 జూనియర్ కళాశాలలకు చెందిన 14,425 మంది విద్యార్థులు ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఇందులో హెచ్‌కేఎమ్ సంస్థ 21 కళాశాలల్లోని 10,293 మంది విద్యార్థులకు, మన ట్రస్ట్ 12 కళాశాలల్లోని 4,132 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం మీద హెచ్‌కేఎమ్ ఏజెన్సీ పరిధిలో మొత్తం 1,183 విద్యాసంస్థల్లో అంటే 1162 స్కూళ్లు, 21 కాలేజీల్లో భోజనం అందించనుంది. మన ట్రస్ట్ ఏజెన్సీ పరిధిలో 119 విద్యాసంస్థల్లో అంటే.. అందులో 107 స్కూళ్లు, 12 కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ అందించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,561 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20.29 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. ఈ స్కీమ్ పూర్తిస్థాయిగా ఇంప్లిమెంట్ అయితే పాఠశాలల్లో చదివే 20.29 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. అలాగే తెలంగాణలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారు. వీరికి తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. ఈ స్కీమ్ పూర్తిగా అమలైతే.. 2 లక్షల మందికి లబ్ధి కలగనుంది.
ఇదిలాఉండగా ఇంటర్ విద్యార్థుల ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కార్యక్రమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో బ్రేక్‌ఫాస్ట్‌కు రూ. 80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లుగా పేర్కొంది. వాస్తవానికి జూనియర్ కాలేజీల్లో తొలి విడుతలో 64 కాలేజీల్లో ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయాలని భావంచినా చివరకు 33 కాలేజీల్లో మాత్రమే సర్కార్ అమలుచేయనుంది. కళాశాల విద్యార్థులకు వారంలో 6 రోజులు హెల్తీ టిఫిన్లు అందించనున్నారు. ఈ మెనూలో ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా, దోసె, పూరీ, బోండాలు ఉన్నాయి. దీనితో పాటు వారానికి మూడు రోజులు 150 మిల్లీలీటర్ల పాలు, మరో మూడు రోజులు రాగిజావ అందించనున్నారు.
Also read: GHMC Vehicles: జీహెచ్ఎంసీలో బిగ్ స్కామ్.. బైక్ నెంబర్లతో కారు బిల్లులు క్లెయిమ్..!